ముంబై: ‘నీకు రాజకీయాలు ఎందుకు. ఇంటికెళ్లి వంట చేస్కో’ అంటూ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎట్టకేలకు ఆమెకు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆ రాష్ట్ర మహిళా కమిషనర్‌కు వివరణ ఇచ్చారు. మధ్యప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు కోటా కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సూలే ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ ఢిల్లీలోని కొందరు ముఖ్య వ్యక్తులను కలిశారని, ఇది జరిగిన రెండు రోజులకే ఓబీసీ రిజర్వేషన్ వచ్చిందని వ్యాఖ్యానించారు. దీని గురించి చౌహాన్‌ను అడిగినా ఆయన నుంచి సమాధానం ఏమీ లేదన్నారు.
కాగా, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రకాంత్ పాటిల్ బుధవారం జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. ‘మీరు (సూలే) ఇంకా రాజకీయాల్లో ఎందుకు ఉన్నారు? ఇంటికెళ్లి వంట చేసుకోండి. ఢిల్లీకి వెళ్తారో.. శ్మశానానికి వెళ్తారో మాకు తెలియదు. మాకు ఓబీసీ కోటా కావాలి. లోక్‌సభ ఎంపీ అయిన మీకు సీఎం అపాయింట్మెంట్ కూడా ఎలా తీసుకోవాలో తెలియదా?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్ర మహిళా కమిషన్ దీనిపై ఆయనకు నోటీస్ పంపింది. దీంతో తన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్‌పై అసంతృప్తితో అలా అన్నానని వివరణ ఇచ్చారు.
దీనిపై సుప్రియా సూలే కూడా స్పందించారు. తాను తొలి రోజు నుంచే ఆయన వ్యాఖ్యపై తిరిగి వ్యాఖ్యానించడం మానుకున్నట్లు తెలిపారు. ‘కానీ క్షమాపణ చెప్పడం ద్వారా ఆయన తన పెద్ద మనసును చాటుకున్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో ఆపాలని ప్రతి ఒక్కరినీ నేను కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.