న్యూఢిల్లీ: బాలల అశ్లీల చిత్రాల (చైల్డ్ పోర్నోగ్రఫీ) డౌన్‌లోడింగ్‌ను నేరంగా పరిగణించరాదన్న మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో నిందితుడితోపాటు తమిళనాడు పోలీసులకు సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం నోటీసులు జారీచేసింది.
ఎవరినీ ప్రభావితం చేయకుండా రహస్యంగా బాలల అశ్లీల చిత్రాలను డౌన్లోడ్ చేయడాన్ని, చూడటాన్ని పోక్సో చట్టం కింద గానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గానీ నేరంగా పరిగణించలేమంటూ మద్రాస్ హైకోర్టు జనవరిలో సంచలనాత్మక తీర్పును వెలువరించింది. అశ్లీల ఫొటోలు, వీడియోలను ఇతరులకు పంపిణీ చేసేందుకు లేదా బహిరంగంగా ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తేనే నేరం అవుతుందని ఆ తీర్పులో పేర్కొంటూ.. చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను మొబైల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసినట్టు అభియోగాలను ఎదుర్కొంటున్న ఓ నిందితుడిపై విచారణను రద్దు చేసింది.