షాదోల్, ఆగస్టు 1: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. షాదోల్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ వాహనానికి అయ్యే ఖర్చును భరించే స్తోమత లేకపోవడంతో ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని మోటర్ సైకిల్‌పై దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. 60 ఏండ్ల మహిళ మృతదేహాంతో ఆ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని నడుపుకొంటూ వెళ్తున్న ఆ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షాదోల్ ప్రభుత్వ వైద్య కళాశాల యాజమాన్యం స్పందించింది. తమ కళాశాలలో అంబులెన్స్ లేదా మృతదేహాన్ని తరలించే వాహనం అందుబాటులో లేదని, వేరే వాహనాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మృతురాలి కుటుంబ సభ్యులు తమను కోరలేదని వివరించింది.