భోపాల్, జైపూర్, జూలై 6: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ప్రజాధనం అప్పనంగా అవినీతిపరుల పరమవుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, తనిఖీల లేమి వల్ల ఇది జరుగుతున్నది. ఇటీవల ప్రభుత్వ స్కూళ్లకు పెయింట్ వేయకుండానే కొందరు నకిలీ బిల్లులతో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఎలాంటి తనిఖీ లేకుండానే అధికారులు కళ్లు మూసుకుని వీటికి సంబంధించిన బిల్లులపై ఆమోదముద్ర వేశారు. ఆ బిల్లులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నిందితులు షాడోల్ జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశాలలకు పెయింట్ వేయకుండానే వేసినట్టు నకిలీ బిల్లులు సృష్టించారు.
సకాండిలోని ఒక స్కూల్‌కు రూ.1.07 లక్షలు, నిపానియా గ్రామంలోని మరో స్కూల్‌కు రూ.2.3 లక్షలు అయినట్టు పేర్కొన్నారు. సుధాకర్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ ఈ పనులు చేపట్టినట్టు మే 5న బిల్లులు సృష్టించారు. ఈ పెయింటింగ్ పనుల్లో పదుల సంఖ్యలో పెయింటర్లు, మేస్త్రీలు పాల్గొన్నట్టు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ రెండు పాఠశాలల్లో ఎలాంటి పెయింట్ పనీ జరగలేదు. పైగా నిపానియాలోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ఏప్రిల్ 4నే దానికి సంబంధించిన బిల్లును ఆమోదిస్తూ సంతకం కూడా చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారి చెప్పారు.
బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న రాజస్థాన్ పోలీస్ అకాడమీలో మోనా బుగాలియా (33) అనే మహిళ నకిలీ రికార్డులతో ఎస్ఐ అవతారమెత్తడమే కాక ఏకంగా రెండేళ్లు పాటు శిక్షణ కూడా పొందింది. ఆమె సీనియర్ అధికారులతో ఔట్‌డోర్ డ్రిల్లులలో పాల్గొనడమే కాక, వారితో తీసుకున్న అనేక ఫొటోలను సామాజిక మాధ్యమంలో ఉంచుతూ కాబోయే పోలీస్ అధికారిగా విస్తృతంగా ప్రచారం చేసుకునేది. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ ఆర్డర్లు సృష్టించి ఆమె అకాడమీలో 2021లో చేరి 2023 వరకు ఉందని అధికారులు తెలిపారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఆమెను నాగ్‌పూర్ జిల్లాలో శుక్రవారం అరెస్ట్ చేసి ఆమె ఇంటి నుంచి రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్ 12 ఏళ్లుగా ఎలాంటి డ్యూటీ చేయకుండానే రూ.28 లక్షలు జీతంగా పొందారు. విదిశా జిల్లాలో ఒక కానిస్టేబుల్ 2011లో భోపాల్ పోలీస్ లైన్స్‌లో కానిస్టేబుల్‌గా నియమితుడయ్యాడు. కొద్ది రోజులకు అతడిని ప్రాథమిక శిక్షణ కోసం సాగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు పంపారు. అయితే అతను అందులో శిక్షణకు వెళ్లకుండానే విదిశలోని తన ఇంటికి వచ్చేశాడు. తర్వాత ఏకంగా తన సర్వీస్ రికార్డును భోపాల్ పోలీస్ లైన్స్‌కు స్పీడ్ పోస్ట్‌లో పంపాడు. దీనిని నమోదు చేయకపోవడంతో పే రోల్లో అతని పేరు కొనసాగుతూనే ఉంది. దీంతో అతడు ఎలాంటి విధులు నిర్వహించకున్నా 12 ఏండ్ల పాటు అతడికి సుమారు రూ.28 లక్షలను ప్రభుత్వం జీతంగా అందించింది.