BJP | న్యూఢిల్లీ, జూన్ 13: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో పలు ప్రభుత్వ కార్యాలయాలున్న సాత్పురా భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.25 కోట్లకు పైగా విలువైన ఫర్నీచర్‌తో పాటు 12 వేల ముఖ్యమైన ఫైళ్లు దగ్ధమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా కొద్ది నెలల ముందు జరిగిన ఈ అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత పదేండ్లలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే భవనంలో అగ్ని ప్రమాదం జరుగడం ఇది మూడోసారి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా కీలకమైన ఫైళ్లేవీ నాశనం కాలేదని బీజేపీ పేర్కొన్నది. సాత్పురా భవన్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అనేక విభాగాలు ఉన్నాయి. ముందుగా మూడో అంతస్తులో ప్రారంభమైన మంటలు క్రమంగా నాలుగు, ఐదు, ఆరో అంతస్తుకు వ్యాపించాయి.
దశాబ్ద కాలంలో మూడో అగ్నిప్రమాదం
సాత్పురా భవన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కొత్తేమీ కాదు. దశాబ్ద కాలంలో ఇది మూడోసారి. కాకతాళీయంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే ఈ మూడుసార్లు అగ్నిప్రమాదం సంభవించటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. 2012లో, 2018లో కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ భవన్లో అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడు కూడా మూడో అంతస్తులోనే మంటలు మొదలై పై అంతస్తుల వరకు వ్యాపించాయి. కొవిడ్ బాధితులకు చేసిన చెల్లింపుల వివరాలు, భోపాల్ గ్యాస్ ఘటనకు సంబంధించిన ఫైళ్లు దగ్ధమైనట్టు చెప్తున్నారు. అగ్నిప్రమాద కారణాలపై దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఓ కమిటీని వేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
ఏసీ పేలడం వల్లేనా?
ప్రాథమిక సమాచారం ప్రకారం సాత్పురా భవన్ మూడో అంతస్తులో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు మంటలు చెలరేగాయి. ఏసీ పేలడం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైర్‌టెండర్లు, నిపుణులు 14 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సాధారణంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భవనంలోని అలారం మోగాలి. కానీ ఇక్కడ ఆ వ్యవస్థ ఉన్నప్పటికీ అది మోగలేదు. అగ్నిమాపక దళం కూడా చాలా ఆలస్యంగా సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిసింది.
కావాలనే నిప్పు పెట్టారా?
వరుసగా మూడోసారి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వ కీలక విభాగాల కార్యాలయాలున్న సాత్పురా భవన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం యాదృచ్ఛికం కాదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఈ అగ్నిప్రమాదం వెనుక కూడా భారీ కుట్ర ఉన్నదని ఆ పార్టీ చెప్తున్నది. సోషల్‌మీడియా వేదికగా కాంగ్రెస్ ఇప్పటికే దీనిపై విస్తృతంగా ప్రచారం మొదలెట్టింది. ఇది ప్రమాదమా లేక కావాలనే నిప్పు పెట్టారా? అని మాజీ సీఎం కమల్‌నాథ్ ప్రశ్నించారు. ఇదే భవనంలో గతంలో జరిగిన ప్రమాదంపై చేపట్టిన దర్యాప్తులో ఏం తేలింది? ఎంతమందికి శిక్ష విధించారు? అని ఎమ్మెల్యే జీతూ పట్వారీ ట్విట్టర్లో ప్రశ్నించారు. సాధారణంగా ఎన్నికలకు ముందు తమ అవినీతి ఆధారాలను తుడిచేసేందుకు ప్రభుత్వాలే ఇలా నిప్పు పెడుతుంటాయి అని ఎద్దేవా చేశారు.