న్యూఢిల్లీ, భోపాల్, నాగపూర్: దగ్గు మందు తయారీపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. ఆ శాఖ ఆదివారం అత్యవసరంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల కార్యదర్శులు, డ్రగ్ కంట్రోల్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కోల్డ్రిఫ్ దగ్గు మందును వాడటం వల్ల కనీసం 14 మంది చిన్నారులు మరణించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడటం కోసం మందులను సహేతుకంగా సూచించేలా, నిఘా వ్యవస్థలను విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం చెప్పింది. రివైజ్డ్ షెడ్యూల్ ఎమ్‌ను కట్టుదిట్టంగా పాటించాలని ఔషధాల తయారీ కంపెనీలన్నిటికీ చెప్పింది.
దీనిని పాటించని కంపెనీల లైసెన్సులు రద్దవుతాయని హెచ్చరించింది. వైద్యులు దగ్గు మందులను సూచించేటపుడు హేతుబద్ధంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలకు కేంద్రం తెలిపింది. ముఖ్యంగా చిన్నారులకు మందులను సూచించేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది. బాల్యంలో వచ్చే దగ్గు చాలా వరకు దానంతట అదే తగ్గుతుందని, ఔషధపరమైన చికిత్స అవసరం ఉండదని గుర్తు చేసింది. నిఘాను పెంచాలని, ఆరోగ్య కేంద్రాల్లో ఏమైనా ప్రతికూల పరిస్థితులు, సంఘటనలు జరిగితే, వెంటనే సకాలంలో తెలియజేయాలని చెప్పింది. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ కిందనున్న కమ్యూనిటీ రిపోర్టింగ్ టూల్ గురించి అవగాహనను పెంచాలని తెలిపింది. రాష్ర్టాల మధ్య సమన్వయాన్ని పెంచుకోవాలని కూడా సూచించింది. ఈ సమావేశం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ అధ్యక్షతన జరిగింది.
ఎపిడమాలజిస్టులు, మైక్రో బయాలజిస్టులు, ఎంటమాలజిస్టులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కూడిన కేంద్ర నిపుణుల బృందం మధ్య ప్రదేశ్‌లోని ఛింద్వారా, నాగపూర్లలో పర్యటించింది. బాలల మరణాలపై రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుని, విశ్లేషణ జరిపింది. క్లినికల్, ఎన్విరాన్మెంటల్, ఎంటమాలాజికల్, డ్రగ్ శాంపిల్స్‌ను సేకరించి, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, నాగపూర్‌లోని ఎన్ఈఈఆర్ఐ, ముంబైలోని సెంట్రల్ డ్రగ్ లేబరేటరీలకు పంపించింది.
సాధారణ అంటు వ్యాధుల అవకాశాలను ప్రాథమిక పరీక్షల ఫలితాలు తోసిపుచ్చాయి. ఒక కేసులో మాత్రమే లెప్టోస్పిరోసిస్ పాజిటివ్ కనిపించింది. చిన్నారులు వాడిన 19 మెడిసిన్ శాంపిల్స్‌ను ప్రైవేట్ ప్రాక్టీషనర్స్, సమీపంలోని రిటెయిల్ స్టోర్స్ నుంచి సేకరించారు. 10 శాంపిల్స్ కెమికల్ విశ్లేషణలో 9 నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు వెల్లడైంది. కోల్డ్రిఫ్ దగ్గు మందులో డీఈజీ అనుమతించదగిన పరిమితి కన్నా అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో కోల్డ్రిఫ్ను తయారు చేస్తున్న స్రేసన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీపై తమిళనాడు రెగ్యులేటరీ అథారిటీ ఎఫ్‌డీఏ చర్యలు తీసుకుంది. దీని లైసెన్సును రద్దు చేయాలని సీడీఎస్సీఓ సిఫారసు చేసింది. ఈ కంపెనీపై క్రిమినల్ చర్యలను కూడా ప్రారంభించారు.
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో ఉన్న పరాసియా ప్రజారోగ్య కేంద్రం పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రవీణ్ సోనీని పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. కోల్డ్రిఫ్ దగ్గు మందు తీసుకుని 11 మంది చిన్నారులు మరణించగా, వీరిలో అత్యధికులకు దానిని సిఫారసు చేసినది సోనీనే. పరాసియా ప్రజారోగ్య కేంద్రం బ్లాక్ వైద్యాధికారి అంకిత్ సహ్లామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. సోనీతోపాటు కోల్ట్రిఫ్ సిరప్‌ను తయారుచేసిన స్రేసన్ ఫార్మాస్యూటికల్స్ ఆపరేటర్లపై ఆరోపణలు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు డాక్టర్ ప్రవీణ్ సోనీని తక్షణమే సస్పెండ్ చేశారు. చిన్నారులకు చికిత్స చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్య తీసుకున్నారు. కోల్డ్రిఫ్ వాడటం వల్ల మరణించిన 11 మంది చిన్నారుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు.
కోల్డ్రిఫ్ దగ్గు మందు వాడిన చిన్నారులకు మూత్రపిండాల సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏమిటో ఇంకా గుర్తించలేదని నాగపూర్‌లోని కలర్స్ హాస్పిటల్ డైరెక్టర్ రితేష్ అగర్వాల్ చెప్పారు. తమ దవాఖానలో చేర్పించిన చిన్నారి మూత్రపిండాలు వాచిపోవడం, అత్యధిక క్రియాటినైన్ లెవెల్స్ సహా తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. చిన్నారికి జ్వరం వచ్చిందని, 24 గంటలపాటు మూత్ర విసర్జన చేయలేకపోయినట్లు ఆయన తెలిపారు. కోల్డ్రిఫ్ బాధితులకు ఛింద్వారా, నాగ్‌పూర్ దవాఖానల్లో చికిత్స చేయిస్తున్నారు. వీరికి డయాలసిస్ కూడా చేస్తున్నారు. డయాలసిస్ తర్వాత చిన్నారి కోలుకున్నట్లు రితేష్ చెప్పారు. చిన్నారి పరిస్థితి విషమం కావడానికి కారణం ఏదైనా వ్యాధి? ఔషధాలు లేదా ఏదైనా ఇతర రసాయనమా? అనే విషయం ఇంకా వెల్లడి కాలేదన్నారు. బాధిత చిన్నారి పురుగు మందులను అత్యధికంగా ఉపయోగించే వ్యవసాయ ప్రాంతం నుంచి వచ్చినట్లు తెలిపారు.
మధ్య ప్రదేశ్‌లోని బేటుల్ జిల్లా, ఆమ్లా బ్లాక్‌లో ఇద్దరు చిన్నారులు కోల్డ్రిఫ్ సిరప్ వాడిన తర్వాత మరణించారు. ఆమ్లా బ్లాక్ వైద్యాధికారి డాక్టర్ అశోక్ నర్వారే మాట్లాడుతూ, కమలేశ్వర్ గ్రామానికి చెందిన కబీర్ (4), జమున్ బిచువా గ్రామ చిన్నారి గర్మిత్(2.6) మరణించినట్లు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న ఈ చిన్నారులకు పొరుగున ఉన్న ఛింద్వారా జిల్లా, పరాసియాలో చికిత్స చేయించారన్నారు. వీరు కోల్డ్రిఫ్ సిరప్ వాడినందువల్లే మరణం సంభవించిందా? అనే అంశం నిర్ధారణ కాలేదన్నారు.
కోల్డ్రిఫ్ వాడి, ప్రాణాలు కోల్పోయిన 11 మంది చిన్నారుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరగలేదు. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ఎన్డీటీవీ తన పరిశీలనలో వెల్లడించింది. ఈ సిరప్ కలుషితమైనట్లు తమిళనాడు ప్రభుత్వం 24 గంటల్లో గుర్తించి, తక్షణమే దాని అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్‌లో మరణించిన చిన్నారుల తల్లిదండ్రులు “తమిళనాడు ప్రభుత్వం తక్షణమే స్పందించగలిగినపుడు, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం 11 మంది చిన్నారులు మరణించే వరకు ఎందుకు వేచి చూసింది?” అని నిలదీస్తున్నారు.
మరణించిన 11 మంది చిన్నారులకు పోస్ట్‌మార్టం ఎందుకు జరగలేదని పరాసియా ఎస్డీఎం శుభం యాదవ్‌ను అడిగినపుడు, ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఇందుకు తిరస్కరించారని చెప్పారు. కానీ తల్లిదండ్రులు దీనిని ఖండించారు. పోస్ట్‌మార్టం నిర్వహించాలని ప్రభుత్వ అధికారులు కాని, దవాఖాన సిబ్బంది కాని తమకు చెప్పలేదన్నారు. అధికారులెవరూ తమతో మాట్లాడలేదని చెప్పారు. మరొకరు మాట్లాడుతూ, తన కుమారుని మృతదేహానికి పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించడంపై తనకు అభ్యంతరం లేదన్నారు. పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించకపోతే, ఫోరెన్సిక్ రుజువులు ఉండవు. జవాబుదారీతనం, బాధిత తల్లిదండ్రులకు ఉపశమనం ఉండవు.