భోపాల్: మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలో ఉన్న వీఐటీ భోపాల్ విశ్వవిద్యాలయం క్యాంపస్లో హింసాత్మక నిరసనలు పెల్లుబికాయి. మంగళవారం-బుధవారం మధ్య రాత్రి సుమారు 4,000 మంది విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తాగునీటి కొరత, నాసిరకం ఆహారం, అపరిశుభ్ర మరుగుదొడ్ల వల్ల జాండిస్ వ్యాధికి గురవుతున్నామని, కొందరు మరణించారని ఆరోపించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేస్తున్నట్లు వీడియోలు వెలుగులోకి రావడంతో విద్యార్థులు కోపోద్రిక్తులయ్యారు.
ఓ బస్సు, రెండు కార్లు, ఓ అంబులెన్స్ సహా సుమారు 7 వాహనాలకు నిప్పు పెట్టారు. వైస్ ఛాన్సలర్ నివాసంపై కూడా దాడికి పాల్పడ్డారు. ఆర్వో ప్లాంట్, హాస్టల్ కిటికీలను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సెహోర్ జిల్లాలోని ఐదు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులను మోహరించారు. కళాశాల యాజమాన్యం ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటించింది. ఆస్థా ఎస్డీవోపీ ఆకాశ్ అమల్కర్ మాట్లాడుతూ, కళాశాల, హాస్టల్ క్యాంపస్లలో పరిస్థితి అదుపులో ఉందన్నారు.