‘గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ ప్రారంభిస్తున్నా. పోడు భూములకు సంబంధించి గతంలో ఆదివాసీ, గిరిజన బిడ్డలపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ ఎత్తేస్తాం!’..
-పోడు పట్టాల పంపిణీ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్.
Podu Lands | కేసీఆర్ ఆదివాసీల గోడును మనసుతో ఆలోచించి పరిష్కరిస్తే.. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్వయంగా పంపిణీ చేసిన పోడు పట్టాలు చెల్లవని ఆయన కింద పనిచేసే అధికారులే తిరస్కరించారు. ఇప్పుడు తెలంగాణలో గిరిజనుల కష్టాలు తీరాయని తెలిసిన అక్కడి ఆదివాసీలు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై నిరసనలు తీవ్రతరం చేశారు. ఇదీ ‘తెలంగాణ సర్కార్’ ఎఫెక్ట్
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ స్వయంగా పంపిణీ చేసిన పోడు భూముల పట్టాలకే విలువ లేకుండా పోయింది. ఆ పట్టాలు చెల్లవంటూ అటవీశాఖ అధికారులే తేల్చి చెప్పారు. ఎందుకో తెలుసా? చౌహాన్ ఇచ్చిన పట్టాల్లో ల్యాండ్ టైటిల్ డీడ్, లబ్ధిదారుకు ఎంత భూమి ఇస్తున్నారు? భూ క్రమానుగత కొలతలు, అడవిలో ఆ భూమి ఎక్కడ ఉన్నది? పీడీఏ సర్వే వంటి కీలక విషయాలేమీ లేవు. అందుకే, గడిచిన 14 ఏండ్లుగా తమ హక్కుల కోసం మధ్యప్రదేశ్ ఆదివాసీలు, గిరిజనులు పోరాటం చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో గిరిజనుల కోసం సీఎం కేసీఆర్ తాజా గా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం గురించి తెలుసుకొన్న అక్కడి గిరిజనులు.. పోరాటాన్ని ఇప్పుడు మరింత తీవ్రతరం చేశారు.
అది 2008 మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల సమయం.. బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఓటర్లను మభ్యపెట్టేలా సీఎం చౌహాన్ పలు హామీలను గుప్పించారు. గిరిజనులకు పోడు పట్టాలిస్తామన్నారు. ఎన్నికల ఫలితాలు బీజేపీకి సానుకూలంగా వచ్చాయి. మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చౌహాన్.. పోడు పట్టాల విషయాన్ని పక్కనబెట్టారు. దీంతో నిరసనలు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని ఎక్కువ కాలం నాన్చకూడదనుకొన్న ఆయన.. 2009 అక్టోబర్‌లో గిరిజనులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్భాటంగా చేపట్టారు. 97 మంది గిరిజనులకు పట్టాలను పంపిణీ చేశారు. వార్తాపత్రికల్లో, టీవీల్లో కవరేజీ కూడా బాగానే వచ్చింది. అయితే, పట్టాలు అందుకొన్న సంతోషం ఆదివాసీలకు ఎక్కువకాలం నిలువలేదు. సీఎం జారీచేసిన పట్టాలు చెల్లవని ఆటవీశాఖ అధికారులు తేల్చిచెప్పారు. ప్రభుత్వ భూముల్లో సాగు చేయడాన్ని తప్పుబడుతూ అడవి బిడ్డలపై కేసులు నమోదు చేశారు.
‘కొన్నేండ్లుగా అటవీ భూములను మీరు సాగు చేస్తున్నారు. అయితే, ఆ భూములపై మీకు హక్కు లేకుండా పోయింది. మొదటిసారిగా నా ప్రభుత్వం మీకు పట్టా భూమి ఇస్తున్నది. ఇకపై ఈ భూమిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు వాడుకోవచ్చు. ఈ భూమిపై మీ తర్వాతి తరాలు కూడా హక్కులు కలిగి ఉంటాయి’ అని గిరిజనులకు చౌహాన్ ఇచ్చిన పట్టాల్లో రాసి ఉన్నది. అందరికీ ఒకేతరహా స్క్రిప్ట్. అంతేతప్ప పట్టాను ధ్రువీకరించే లబ్ధిదారు పేరిట ల్యాండ్ టైటిల్ డీడ్, లబ్ధిదారుకి ఎంత భూమి ఇస్తున్నారు? భూ క్రమానుగత కొలతలు ఏంటి? అడవిలో ఆ భూమి ఎక్కడ ఉన్నది? పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ (పీడీఏ) మ్యాపింగ్ సర్వే తదితర కీలక వివరాలేమీ లేవు. ఇవేమీ తెలియని గిరిజనులు తమకు పట్టాలు దక్కాయన్న సంతోషంతో అటవీభూముల్లో సాగు చేసుకోవడం ప్రారంభించారు. అయితే, అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఏ), 2006 ప్రకారం.. ఈ పట్టాలు చెల్లవంటూ అటవీ అధికారులు తేల్చిచెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సాగు చేస్తున్నందుకు 97 మంది గిరిజనులపై కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే చౌహాన్ తప్పుడు పట్టాలను ఇచ్చారని గిరిజన హక్కుల కార్యకర్తలు మండిపడ్డారు.
2009లో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో నాకు కూడా పట్టా ఇచ్చారు. దానిపై నా పేరు తప్ప ఏమీలేదు. ప్రభుత్వం పట్టా ఇచ్చిందన్న సంతోషంతో నా భూమిలో సాగు చేశా. అయితే, ఆ భూమి ప్రభుత్వానిదంటూ అటవీశాఖ అధికారులు నన్ను అడ్డుకొన్నారు. కేసు పెట్టారు. అసలు నేను రైతునే కాదన్నారు. మా తండ్రి కూడా ఇక్కడే కొన్నేండ్లుగా వ్యవసాయం చేశారు. నేను కూడా అదే చేస్తున్నా. అయినా సర్కారుకు మేము రైతులుగా కనిపించట్లేదు.
– రతన్ సింగ్, సహరియా గిరిజన తెగ రైతు, గ్రా: లమానియా, జిల్లా విదిశా, ఎంపీ