న్యూఢిల్లీ: జెన్ జీ ఉద్యమం ధాటికి మరో దేశాధినేత గద్దె దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మడగాస్కర్లో యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి, ప్రెసిడెంట్ ఆండ్రీ రజోలినా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రజోలినా 2009లో ఆర్మీయూనిట్ సీఏపీఎస్ఏటీ మద్దతుతోనే అప్పటి దేశాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేసి, అధికారాన్ని కైవసం చేసుకున్నారు.
అదే ఆర్మీ యూనిట్ ప్రస్తుతం జెన్జీ యువతకు అండగా నిలుస్తున్నది. ‘జెన్ జీ మడగాస్కర్’ పేరుతో తాజా ఉద్యమాలు సెప్టెంబరులో ప్రారంభమయ్యాయి. విద్యుత్తు, నీరు సరఫరా కావడం లేదంటూ ప్రారంభమైన ఉద్యమం చివరికి రజోలినా గద్దె దిగాలని డిమాండ్ చేసే వరకు వెళ్లింది. పేదరికం, జీవన వ్యయం, విద్య, అవినీతి వంటి సమస్యలను జెన్ జీ ఉద్యమకారులు లేవనెత్తారు. నిరసనలు మడగాస్కర్ వ్యాప్తంగా తీవ్రరూపం దాల్చాయి. ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు కూడా రంగంలోకి దిగాయి.