దండేలి(ఉత్తర కన్నడ జిల్లా): గ్యారెంటీలంటూ అలవికాని హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని దివాలా తీయిస్తున్నది. గ్యారెంటీలను అమలుచేయలేక రాష్ట్ర ప్రజలపై రోజుకో పన్ను పోటు పొడుస్తున్నది. గ్యారెంటీలను సక్రమంగా అమలుచేయకపోవడంపై రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మరోవైపు గ్యారెంటీలు గుదిబండగా మారాయని సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలు ఆర్థిక గుదిబండగా మారి రాష్ట్రంలో అభివృద్ధి వేగాన్ని దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, హలియాల్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తానే ముఖ్యమంత్రినైతే ఈ ఐదు గ్యారెంటీలను అమలు చేసేవాడిని కానని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన ఐదు గ్యారెంటీలు రాష్ర్టానికి గుదిబండగా మారాయని సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ దేశ్ఫాండే చెప్పారు. వాటివల్ల ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు కాని వాటిని అమలు చేయడం ప్రభుత్వానికి కష్టతరంగా మారిందని ఆయన అన్నారు. అన్ని ప్రయోజనాలు మహిళలకు దక్కుతుండగా పురుషుల కోసం మాత్రం ఒక్క పథకం కూడా లేదని ఆయన వాపోయారు. గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం అనేక కమిటీలను ఏర్పాటు చేయవలసి వచ్చిందని పాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్న దేశ్పాండే చెప్పారు. దీని కారణంగా రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి కుంటుపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి స్థానంలో నేను ఉండి ఉంటే ఐదు గ్యారెంటీల అమలుకు అనుమతించేవాడిని కాను అంటూ ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి కూడా గతంలో గ్యారెంటీలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గ్యారెంటీలు ఆర్థికంగా పెను భారంగా మారాయని, అభివృద్ధికి ఇవి అడ్డంకిగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు అభివృద్ధి కావాలంటూ గ్యారెంటీలను వదులుకోవాలని ఆయన వ్యాఖ్యానించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.