లక్నో: ఒక ఆటో డ్రైవర్ను మహిళ చెప్పుతో కొట్టింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగింది. అయితే ఆటో డ్రైవర్ను ఆ మహిళ ఎందుకు కొట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ నెల 21న ఇద్దరు వ్యక్తులతో కలిసి ఒక మహిళ ఆటోలో ప్రయాణించింది. అయితే ఆటో ఛార్జీ చెల్లింపు విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఆటో డ్రైవర్, వారి మధ్య వాగ్వాదం జరిగింది. తిట్టవద్దని ఆటో డ్రైవర్ చెప్పడంతో ఆ ముగ్గురు అతడిపై దాడికి దిగారు. దీంతో ఆటో డ్రైవర్ సమీపంలో ఉన్న పోలీసుల వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు.
అంతలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసుల ఎదుటే అతడిపై దాడి చేయబోగా కొందరు అడ్డుకున్నారు. మరోవైపు ఆ మహిళ ఆటో డ్రైవర్ చెంప చెళ్లుమనిపించడంతోపాటు తన కాలి చెప్పు తీసి అతడ్ని కొట్టింది. ట్రాఫిక్ పోలీసులు కలుగజేసుకుని సర్దిచెప్పారు. కాగా, అక్కడున్న వారు తమ మొబైల్లో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.