న్యూఢిల్లీ, పుణె, మే 16: కొన్ని అనుచితమైన కోరికలకు బదులుగా లీకైన ప్రశ్నపత్రాలను స్వీకరించాలని లక్నో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పరంజిత్ సింగ్ ఒక విద్యార్థినిని అడుగుతున్నట్లుగా ఉన్న ఒక కాల్ రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. ఆ ప్రొఫెసర్ జంతుశాస్త్ర విభాగానికి చెందిన ఒక బీఎస్సీ విద్యార్థినికి ఫోన్ చేసి తనను కలుసుకోవాలని కోరడం ఆ కాల్ రికార్డింగ్‌లో ఉంది. కాల్ రికార్డింగ్ ప్రకారం డార్లింగ్..నీ కోసం రెండు పేపర్లు బయటకు తెచ్చాను. నన్ను కలవడానికి ఎప్పుడు వస్తావు అని ఆ ప్రొఫెసర్ విద్యార్థినితో అన్నాడు. అందుకు ఆ విద్యార్థిని సార్, నేను చదివి సిలబస్ పూర్తిచేశాను అని జవాబివ్వగా అయితే నువ్వు కలవడానికి ఒక్కసారి కూడా రావా? అని ప్రొఫెసర్ ప్రశ్నించాడు. ఇంట్లో పనులు చూసుకోవాలి. రావడానికి ప్రయత్నిస్తాను అని విద్యార్థిని బదులిచ్చింది. దీనికి ఆ ప్రొఫెసర్ ప్రయత్నించవద్దు. పరీక్షలకు ఏడు రోజుల ముందే రావాలి అంటూ షరతు విధించాడు. దర్యాప్తు బృందం ప్రొఫెసర్ అరెస్టుకు రెండు కారణాలను గుర్తించింది. . కాల్ ముగింపులో సింగ్ మళ్లీ లైంగికంగా వేధించేందుకు తనను కలవమని పిలిచినట్లు విద్యార్థిని లక్నో యూనివర్సిటీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ శనివారం మహారాష్ట్రలోని పూణెకు చెందిన సీనియర్ బోటనీ టీచర్ మనీషా గురునాథ్ మంధారేను అరెస్ట్ చేసింది. ఆమెను ఢిల్లీలో విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు. మంధారే నీట్ యూజీ పరీక్ష ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆమెను సబ్జెక్ట్ నిపుణురాలిగా నియమించింది. పుణెలోని తన ఇంటిలో మంధారే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించారని, ఆమె బోటనీ, జువాలజీకి సంబంధించిన పలు ప్రశ్నలు లీక్ చేశారని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది.
నీట్‌యూజీ ప్రశ్నపత్రాల అమ్మకం బేరసారాలు ఎక్కువ శాతం ఆన్లైన్లోనే జరిగినట్టు తెలుస్తున్నది. నీట్‌యూజీ జరిగిన రోజే ప్రశ్నపత్రం లీక్ అయిందని ఇన్‌స్టాగ్రామ్‌లో బయటపెట్టిన ఒక ఎంబీబీఎస్ విద్యార్థి “పేపర్ మాఫియా” వదిలిపెట్టిన డిజిటల్ సాక్ష్యాలను పంచుకున్నాడు. ‘ర్యాంక్ క్యాటలిస్ట్’ అనే మెంటార్షిప్ ప్రొగ్రామ్‌ను స్థాపించిన వైద్య విద్యార్థి దీపక్ పాటిల్ నీట్‌యూజీ జరిగిన రోజే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పోస్ట్ చేశాడు. “దురదృష్టవశాత్తు నేను చెప్తున్నాను..ఈ రోజు జరిగిన నీట్ 2కె26 పేపర్ ఇప్పటికే లీక్ అయ్యింది. భారీస్థాయిలో పేపర్ లీక్ జరిగింది. నా మాటలు గుర్తుంచుకోండి. ఇది భారత విద్యావ్యవస్థకు సిగ్గుచేటు.” అని పేర్కొన్నాడు. పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. లాతూర్‌లోని ఒక పరీక్ష కేంద్రానికి వెళ్లిన విద్యార్థులు ఈ లీక్‌కు సంబంధించిన ఆధారాలను ఆయనకు చూపించారు. ఒక చాట్‌లో లీకేజీ ప్రశ్నపత్రం కోసం రూ. 30 వేలు బుకింగ్ మొత్తంగా తెలిపారు. పరీక్ష పూర్తయ్యాక మరో రూ. 70 వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పేపర్ వేరుగా వస్తే డబ్బు రీఫండ్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.
నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో ఉన్నత విద్యా శాఖ పరిధిలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కీలక నియామకాలకు మంత్రివర్గ నియామకాల కమిటీ శనివారం ఆమోదం తెలిపింది. ఐఎస్ఎస్ అధికారి అనూజ బాపట్, ఐఆర్ఎస్ అధికారి రుచితా విజ్లను ఎన్టీఏలో సంయుక్త కార్యదర్శులుగా నియమించారు. అలాగే ఐఆర్ఎస్ అధికారి ఆకాశ్ జైన్, ఐఏ అండ్ ఏఎస్ అధికారి ఆదిత్య రాజేంద్ర బోజాధియాలు జాయింట్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.