Work Hours | న్యూఢిల్లీ : వారంలో ఎక్కువ గంటలు పని చేస్తేనే దేశం ప్రగతి సాధిస్తుందని ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పని గంటల సంఖ్యపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, జోహో సీఈవో శ్రీధర్, ఆరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్ దాస్ పాయ్, ఎడెల్వీస్ సీఈఓ రాధిక గుప్తా తదితరులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాశి కన్నా వాసి ముఖ్యమని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఎడెల్వీస్ సీఈఓ రాధిక గుప్తా తన వృత్తిగత జీవిత విశేషాలను లింక్డ్ఇన్ పోస్ట్‌లో వివరించారు. కఠోర శ్రమ అనేది ఎవరికి వారు ఎంపిక చేసుకోవాల్సిన అంశమని తెలిపారు. తన కెరీర్ ప్రారంభంలో వరుసగా నాలుగు నెలలపాటు వారానికి 100 గంటలు పని చేసినట్టు తెలిపారు. అయితే ఇలా పని చేసినపుడు అత్యధిక భాగం సమర్థంగా పని చేయలేకపోయానని, మానసికంగా భారంగా ఉండేదని, దవాఖానకు వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు. కఠోర శ్రమ ముఖ్యమేనని, అదే సర్వస్వం కాదని స్పష్టం చేశారు. కార్పొరేట్ నిచ్చెనలో అగ్ర స్థానానికి ఎగబాకాలని అందరూ కోరుకోరన్నారు. సీఈఓ అయిపోవాలని ప్రతి ఒక్కరికీ ఉండదన్నారు. చురుగ్గా, తెలివిగా, సూక్ష్మబుద్ధితో పని చేయాలని, సుదీర్ఘ సమయం పని చేయడం కాదని చెప్పారు. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో 8-4 గంటలు పని చేస్తారని, అయినప్పటికీ, ఆ సమయాన్ని సమర్థంగా, సత్ఫలితాలు వచ్చేలా వినియోగించుకుంటారని తెలిపారు.
తానూ రాశి కన్నా వాసికే ప్రాధాన్యం ఇస్తానని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర చెప్పారు. పని శ్రేష్ఠత మీద దృష్టి పెట్టాలని, పని పరిమాణంపైన కాదని వివరించారు. షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమిత థాపర్ స్పందిస్తూ తమ వ్యాపార వృద్ధి కోసం వ్యవస్థాపకులు ఎక్కువ సేపు పని చేయవచ్చునని, అదే విధంగా ఉద్యోగులు కూడా పని చేయాలని ఆశించకూడదని చెప్పారు. వారానికి 10 గంటలు నేర్చుకోవడానికి కేటాయించాలని క్యూర్‌ఫిట్ వ్యవస్థాపకుడు ముకేశ్ బన్సల్ అభిప్రాయపడ్డారు. స్విగ్గీ ఫుడ్ అండ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ స్పందిస్తూ..పని చేయాలని, అయితే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదని వివరించారు.
ఆర్థికాభివృద్ది కోసం అటువంటి కఠోర శ్రమ అవసరమా అని జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ప్రశ్నించారు. ఎక్కువ మంది ప్రజలు వృద్ధాప్యంలో ఒంటరి జీవితాలను అనుభవిస్తే, ఆ అభివృద్ధికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు. ఆరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్‌దాస్ పాయ్ మాట్లాడుతూ.. కంపెనీలు ఉద్యోగులపై పని గంటలను రుద్ద కూడదన్నారు.
ఉద్యోగులు వారానికి 70 గంటలు పని చేయాలని చర్చ జరుగుతున్న వేళ భుపేంద్ర విశ్వకర్మ అనే ఓ ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి లింక్డ్ఇన్లో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ఇన్ఫోసిస్‌లో తనకు పదోన్నతి వచ్చినా మూడేండ్లు జీతం పెంచలేదని అతడు ఆరోపించారు. 50 మంది చేయాల్సిన పని భారాన్ని ఆ 30 మందిపై వేశారని చెప్పారు. ఎంత పని చేసినా గుర్తింపు ఉండేది కాదని చెప్పారు. ఆన్సైట్ అవకాశాలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం మాట్లాడేవారికే దక్కేవని, హిందీ మాట్లాడే వారి పనితీరు బాగున్నా అవకాశాలు వచ్చేవి కాదని ఆరోపించారు. ఇవన్నీ భరించలేక, తన ఆత్మగౌరవం, మానసిక ఆరోగ్యం విషయంలో రాజీ పడలేక ఉద్యోగాన్ని వదిలేసినట్టు చెప్పారు.