న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కేంద్ర ప్రభుత్వానికి ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరికలు జారీ చేశారు. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న కమీషన్, ఇతర డిమాండ్లను రానున్న మూడు నెలల్లోగా పరిష్కరించకపోతే దేశ వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని అల్టిమేటం జారీ చేశారు. భోపాల్‌లో శనివారం జరిగిన అసోసియేషన్ జాతీయ సమావేశం అనంతరం ఈ మేరకు ఒక తీర్మానం చేసినట్టు తెలిపారు.
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్ల గురించి కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాశామని చెప్పారు. ఇప్పుడు తమకు ఇస్తున్న కమీషన్‌కు, నిర్వాహక వ్యయానికి ఎంతమాత్రం పొంతన లేదని సంఘం అధ్యక్షుడు బీఎస్ శర్మ తెలిపారు. దీంతో తమ కమీషన్‌ను కనీసం రూ.150కు పెంచాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. డిమాండ్ లేకపోయినా గృహేతర సిలిండర్లను ఆయిల్ కంపెనీలు పెద్దయెత్తున పంపుతున్నాయని, దీనిని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.