న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గ్యాస్ సిలిండర్ కనిపించింది. ఆ మార్గంలో వెళుతున్న గూడ్స్ రైలు లోకో పైలట్ దీనిని గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో ప్రమాదం తప్పింది. ట్రాక్‌పై గుర్తించిన అయిదు కిలోల సామర్థ్యం గల ఖాళీ సిలిండర్‌ను తొలగించామని స్థానిక పోలీసులు వెల్లడించారు.
అలాగే గుజరాత్‌లోని కిమ్-కోసాంబ మధ్య కిమ్ వంతెన సమీపంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై సేఫ్టీ పిన్ ఇలాస్టిక్ రైల్ క్లిప్‌ను తొలగించి, గరీబ్ రథ్ రైలును ప్రమాదానికి గురయ్యేలా చేయాలని చేసిన కుట్ర విఫలమైంది. కాగా, ఎంపీలో గత బుధవారం సైన్యం ప్రత్యేక రైలును కొద్దిసేపు ఆపివేయడానికి కారణమైన డిటోనేటర్లను ‘హాని రహిత’మైనవిగా రైల్వే అభివర్ణించింది.