Vision loss | కంటి చూపు కోసం ఆపరేషన్ చేయించుకుంటే ఉన్న చూపు పోయిందంటూ ఉత్తరప్రదేశ్ ప్రజలు అక్కడి డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. చూపు తెప్పించమని పోతే ఉన్న చూపు పోగొట్టారని పలువురు వృద్ధులు, మహిళలు వాపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. యోగి నాయకత్వంలోని ఆరోగ్య శాఖ భారీ నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగు చూసింది. కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న ఆరుగురు కంటి చూపును కోల్పోయారు.
కాన్పూర్ శివరాజ్పూర్కు చెందిన పలువురు కాన్పూర్ సౌత్‌లో బర్రా బైపాస్ రోడ్డులో ఉన్న ఆరాధ్య నర్సింగ్‌లో ఆయుష్మాన్ కార్డుదారులకు ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించారు. పలువురికి కంటిశుక్లం శస్త్రచికిత్స చేశారు. వీరికి డాక్టర్ నీరజ్ గుప్తా సర్జరీ చేశారు. ఆపరేషన్ అయ్యాక వారిని ఇంటి వద్ద దింపి వచ్చారు. అయితే, అదో రోజు నుంచి వారి కళ్లలో నొప్పి మొదలై కళ్ల నుంచి నీళ్లు కారాయి. ఆ తర్వాత చూపు ఆగిపోయింది. దీనిపై వారు ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది.
దాంతో బాధితులు ఆలస్యంగా రాజధానిలోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అలోక్ రంజన్‌ను ఆశ్రయించారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. జరిగిన తప్పిదాన్ని వెనకేసుకు వచ్చేందుకు విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించి ఆయన చేతులు దులిపేసుకున్నాడు. ఎవరైనా ఐ క్యాంప్ పెట్టి సర్జరీలు చేయాలంటే సీఎంఓ అనుమతి తప్పనిసరి. కాగా, సీఎంఓ అనుమతి ఇవ్వడంతోనే డీబీసీఎస్ పథకం కింద ఐ సర్జరీ క్యాంపు నిర్వహించినట్లు పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వమంటే ఎలాగుంటుందో.. ఎంత ప్రయోజనముంటుందో అని భావించారే కానీ, చూపు కోల్పోయేలా సర్జరీలు చేపిస్తుందని మాత్రం ఆ పేద గ్రామీణులు కలలో కూడా అనుకుని ఉండరు.