న్యూఢిల్లీ, జూలై 11: లూజ్ ఫాస్టాగ్(విండ్‌షీల్డ్‌కు అంతికించనివి)లకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. లూజ్ ఫాస్టాగ్‌లను ఇకపై బ్లాక్‌లిస్ట్‌లో చేర్చనుంది. లూజ్ ఫాస్టాగ్‌లను గుర్తించినప్పుడు వెంటనే దాన్ని రిపోర్ట్ చేయాలని టోల్ కలెక్టింగ్ ఏజెన్సీలను ఆదేశించింది. ఆగస్టు 15 నుంచి వార్షిక పాసు విధానాన్ని, మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో(ఎంఎల్ఎఫ్ఈ) టోలింగ్ ప్రారంభించాలని రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ భావిస్తున్న దృష్ట్యా ఫాస్టాగ్ విధానం విశ్వసనీయతను, కచ్చితత్వాన్ని ఇది పెంపొందించనున్నది.
బ్లాక్ లిస్టింగ్ చేయదలచిన లూజ్ ఫాస్టాగ్‌లు లేదా ట్యాగ్ ఇన్ హ్యాండ్‌గా పిలుచుకునే ఫాస్టాగ్‌లకు సంబంధించిన సమాచారాన్ని పంపడానికి ఓ ప్రత్యేక ఈమెయిల్ ఐడీని సృష్టించినట్లు ఎన్హెచ్ఏఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. 98 శాతం సక్సెస్ రేటు ఉండడంతో ఫాస్టాగ్ విధానం దేశంలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. లూజ్ ఫాస్టాగ్‌లు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ కార్యకలాపాల సామర్థ్యానికి సవాలుగా మారినట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. ఈ సమస్యను తొలగిస్తే నేషనల్ హైవే యూజర్లకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించడానికి వీలుగా టోల్ కార్యకలాపాలను తయారుచేయవచ్చని పేర్కొన్నది.