మైసూరు, అక్టోబర్ 25: మైసూరు అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతిని లోకాయుక్త పోలీసులు విచారించారు. మైసూరులో శుక్రవారం నాలుగున్నర గంటల పాటు విచారణ జరిగింది. ముడా తనకు పరిహారంగా కేటాయించిన 14 స్థలాల గురించి పోలీసులు ప్రశ్నించారు.
ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులకు బీఎం పార్వతి సమర్పించినట్టు తెలుస్తున్నది. కాగా, తక్కువ విలువైన భూమిని ముడాకు అప్పగించి, పరిహారంగా ఖరీదైన 14 స్థలాలను పొందారని సిద్ధరామయ్య, పార్వతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 27న లోకాయుక్త పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా, ఈ కేసు నేపథ్యంలో ఇటీవలే వివాదాస్పద స్థలాలను బీఎం పార్వతి తిరిగి ముడాకు అప్పగించారు.