బెంగళూరు, ఫిబ్రవరి 19: ముడా భూ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతికి లోకాయుక్త పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. ఈ కేసులో వీరిపై ఆరోపణలు నిరూపించేందుకు సరైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ హైకోర్టుకు తుది నివేదిక సమర్పించారు. పార్వతి నుంచి తక్కువ విలువ చేసే భూమిని సేకరించిన ముడా.. పరిహారంగా ఖరీదైన స్థలాలను అప్పగించిందనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.
సిద్ధరామయ్యకు క్లీన్చిట్ ఇచ్చిన లోకాయుక్త పోలీసుల తీరుపై కర్ణాటక ప్రతిపక్ష నేత అశోక మండిపడ్డారు. ఇది ఊహించినదేనని, లోకాయుక్త పోలీసులకు పదోన్నతులు, పోస్టింగులు కావాలని, ఇందుకు వారు చెప్పినట్టు చేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. సీబీఐ విచారణతోనే నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.