Lok Sabha polls : లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మొత్తం ఏడు దశల్లో సుదీర్ఘ కాలం లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ నిర్వహించగా.. ఇవాళ ఆఖరిది అయిన ఏడో విడత పోలింగ్ జరిగింది. ఏడో విడతలో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏడో విడతలో మొత్తం 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు.
మొత్తం 545 లోక్సభ స్థానాలకు నేటితో పోలింగ్ ముగిసినట్లయ్యింది. జూన్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలతోపాటే ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా జూన్ 4న వెల్లడికానున్నాయి. దాంతో ఈ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.