Lok Sabha Polls | లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ తుది గణాంకాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆరో దశలో 63.37శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించింది. 61.95శాతం పురుషులు, 64,95శాతం మహిళలు, 16.67శాతం మంది థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పింది. లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 25న ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందులో జమ్మూఅండ్ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ పార్లమెంటరీ నియోజకవర్గం సైతం ఉన్నది. ఇక్కడ ఓటింగ్ ఆరో దశకు వాయిదా వేసింది.
వాస్తవానికి ఇక్కడ మూడో దశలో ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఆరో దశలో కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ, మనోజ్‌తివారీ, నిర్హువా, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, మాజీ సీఎం మనోహర్‌లాల్ కట్టర్‌తో సహా పలువురు కేంద్రమంత్రుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఆరో దశలో ఓటింగ్ జరిగిన స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌లోని 14 సీట్లు, హర్యానాలోని 10 సీట్లు, బీహార్‌లో ఎనిమిది, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది సీట్లు, ఢిల్లీలోని ఏడు సీట్లు, ఒడిశాలోని ఆరు సీట్లు, జార్ఖండ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని అత్యల్పంగా ఓట్లు పోలయ్యాయి.