Lok Sabha : ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation One Election)’ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీ (JPC) కి పంపడానికి లోక్‌సభ (Lok Sabha) అనుమతించింది. బిల్లును జేపీసీకి పంపడంపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 220 ఓట్లు, వ్యతిరేకంగా 149 ఓట్లు వచ్చాయి. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదం లభించినట్లైంది.
పార్లమెంట్ నూతన భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై అనుమానం ఉన్న వాళ్లు ఓటింగ్ స్లిప్‌లతో క్రాస్ చెక్ చేసుకునేందుకు స్పీకర్ అనుమతించారు. దేశంలో లోక్‌సభతోపాటే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికల నిర్వహించడం కోసం వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును తీసుకొచ్చారు.
ఇది 129వ రాజ్యాంగ సవరణ బిల్లు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఇవాళ ఉదయం వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై సంపూర్ణ అధ్యయనం కోసం జేపీసీ పంపాలని భావిస్తున్నట్లు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనపై ఓటింగ్ నిర్వహించగా మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ అనుమతి లభించినట్లయ్యింది.