న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. శుక్రవారం లోక్‌సభ నుంచి ఆమెను బహిష్కరించారు. ఈ మేరకు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన వాడీవేడి చర్చలో మొయిత్రా మాట్లాడటానికి అవకాశం కల్పించాలని ప్రతిపక్ష సభ్యులు చేసిన డిమాండ్‌ను స్పీకర్ అంగీకరించలేదు. గతంలో ఈ తరహా ఉదంతాల్లో నిందితులకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఉదహరించారు. మొయిత్రా చర్యను అనైతిక ప్రవర్తనగా పేర్కొంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి పద్ధతిలో ఆమోదించింది. ఓటింగ్ సమయంలో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. లోక్‌సభ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనధికార వ్యక్తులతో పంచుకోవడం దేశ భద్రతపై ప్రభావం చూపిస్తుందని ప్రహ్లాద్ జోషి అన్నారు.
మొయిత్రా సస్పెన్షన్‌పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయడమేనన్నారు. ‘మా పార్టీ ఆమెకు అండగా నిలబడుతుంది. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నది’ అని మీడియా సమావేశంలో మమత అన్నారు. మరోవైపు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన 500 పేజీల నివేదిక చదవడానికి 48 గంటల సమయం ఇవ్వాలని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. మొయిత్రా సస్పెన్షన్‌ను ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించాయి. ‘కొత్త సభలో ఇదొక కొత్త చీకటి రోజు(బ్లాక్ డే). ఒక కొత్త చీకటి అధ్యాయం ఈ రోజు ప్రారంభమైంది’ అని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. మొయిత్రా సస్పెన్షన్ అంశం చర్చను వాయిదా వేయాలని ఆయన స్పీకర్‌కు లేఖ రాశారు. బీఎస్పీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ సభ్యుడు డానిష్ అలీ మాట్లాడుతూ కమిటీ ఇచ్చిన నివేదిక అసంపూర్తిగా ఉందన్నారు.
లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడంపై మొయిత్రా స్పందిస్తూ అనధికార కోర్టు(కంగారు కోర్టు) ద్వారా తనపై చర్యలు తీసుకొన్నారని.. విపక్షాలను అణగదొక్కేందుకు ప్రభుత్వం పార్లమెంటరీ ప్యానెల్‌ను ఆయుధంగా చేసుకొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాకిప్పుడు 49 ఏండ్లు. వచ్చే 30 ఏండ్లు నేను పార్లమెంట్ లోపల, బయట మీకు వ్యతిరేకంగా పోరాడతాను. బహిష్కరించడానికి ఎథిక్స్ కమిటీకి ఎలాంటి అధికారాలు లేవు. ఈ కమిటీ ప్రతి నిబంధననూ ఉల్లంఘించింది. రేపు నన్ను వేధించడానికి సీబీఐను మా ఇంటికి పంపుతారేమో. మీరు(బీజేపీ) నిర్దిష్ట పద్ధతిని పాటించలేదు. ఇది మీ అంతానికి నాంది. ఒక్క లాగిన్‌తో దేశ భద్రత ప్రమాదంలో పడుతుందా? అదానీ మన ఓడరేవులు, విమానాశ్రయాలన్నీ కొంటున్నారు. ఆయన షేర్ హోల్డర్లు విదేశీ పెట్టుబడిదారులు. కానీ మన మౌలిక సదుపాయాలన్నీ కొనడానికి హోం శాఖ అనుమతి ఇస్తున్నది.’ అని ఆమె అన్నారు.
అదానీ గ్రూప్ గురించి ప్రశ్నలు అడిగేందుకు తాను ఎంపీ మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఆరోపించారు. కృష్ణా నగర్ ఎంపీ అయిన మహువా మొయిత్రా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీని దూషించి ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. తాను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా పార్లమెంట్ లాగిన్ ఉపయోగించానని అక్టోబర్ 19న తెలిపారు. దీనిపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హీరానందానీ అప్రూవర్‌గా మారారు. దీనిపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న విచారణ జరిపి హీరానందానీ ఆరోపణలు నిజమేనని.. మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదన చేస్తూ లోక్‌సభకు నివేదిక ఇచ్చింది. దూబే ఫిర్యాదుపై మొయిత్రా ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు.