Mahua Moitra | న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉన్నది. లోక్‌సభ నుంచి ఆమెను బహిష్కరించాలని బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ నేతృత్వంలోని నైతిక విలువల కమిటీ సిఫారసు చేసింది. మహువాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి రూపొందించిన నివేదికను 6:4 మెజారిటీతో కమిటీ గురువారం ఆమోదించింది. ఈ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టి ఓటింగ్ చేపట్టనున్నారు. ఎంపీపై బహిష్కరణ వేటు వేయాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయడం ఇదే మొదటిసారని లోక్‌సభ మాజీ జనరల్ సెక్రటరీ ఆచార్య తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మహువా మొయిత్రా పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
సమావేశం అనంతరం కమిటీలోని ప్రతిపక్ష ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, నివేదికలో సిఫారసులు పక్షపాత ధోరణిలో ఉన్నాయని మండిపడ్డారు. అదానీ వ్యవహారంలో మోదీ సర్కార్‌ను ప్రశ్నించిన వారిపై కేంద్రం వేధింపులకు దిగుతున్నదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈ పోరాటంలో ఆమెకు పార్టీ అండగా నిలబడుతుందన్నారు.
ఎథిక్స్ కమిటీ ఆమోదించడానికి ముందే నివేదికలోని అంశాలు బయటకు రావటం సంచలనం రేపింది. మొయిత్రా ఎంపీ సభ్యత్వంపై వేటు వేసేలా కమిటీ సిఫారసు చేయబోతున్నదంటూ ఓ ప్రైవేట్ న్యూస్ చానల్లో బుధవారం వార్తా కథనం ప్రసారమైంది. దీనిపై మహువా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీగా తన హక్కులకు భంగం వాటిల్లందంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు.
‘ఓ ఎంపీని లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయటం ఇదే మొదటిసారి’ అని లోక్‌సభ మాజీ జనరల్ సెక్రటరీ పీడీటీ ఆచార్య అన్నారు. ‘తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో నివేదికను ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిపై ఓటింగ్ జరిపి సదరు ఎంపీపై కేంద్రం బహిష్కరణ వేటు వేయొచ్చు’ అని ఆచార్య అభిప్రాయపడ్డారు.
తనను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తే తిరిగి భారీ మెజార్టీతో గెలిచి సభలో అడుగుపెడతానని ఎంపీ మొయిత్రా అన్నారు. ఎథిక్స్ కమిటీ సిఫారసుపై ఆమె ఈ మేరకు స్పందించారు. ‘మోదీ సర్కారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది’ అని అన్నారు. ఏదేమైనా బీజేపీ-అదానీ వ్యవహారంపై తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఎథిక్స్ కమిటీ విచారణపై మాట్లాడుతూ ‘వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అయినా నన్ను ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని క్రాస్-ఎగ్జామినేషన్ చేయలేదు. బహుమతులు అందాయన్న దానికి ఒక్క ఆధారమూ చూపలేదు’ అని ఆమె అన్నారు.