న్యూఢిల్లీ, డిసెంబర్ 19: విపక్ష ఎంపీల 12 గంటల నిరసనల మధ్య గురువారం అర్ధరాత్రి వీబీ-జీ రామ్ జీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. తర్వాత శుక్రవారం కూడా ఈ బిల్లు విషయమై విపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. ఆ తర్వాత శీతాకాల సమావేశాలను ముగిస్తున్నట్టు లోక్‌సభ, రాజ్యసభ సభాధిపతులు ప్రకటించారు. అంతకు ముందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీనరేగా)ను రద్దు చేసి దాని స్థానంలో వీబీ-జీ రామ్ జీ బిల్లును ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు గురువారం రాత్రి పార్లమెంట్ కాంప్లెక్స్‌లో 12 గంటల ధర్నా నిర్వహించారు. ప్రతిపక్షాల అభ్యంతరాలను తోసి పుచ్చి కేంద్ర ప్రభుత్వం వీబీ-జీ రామ్ జీ బిల్లును ఏకపక్షంగా ఆమోదించిందని టీఎంసీ రాజ్యసభ ఉప నాయకురాలు సాగరికా ఘోష్ ఆరోపించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య వీబీ-జీ రామ్ జీ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది.
గురువారం అర్ధరాత్రి ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలన్నది తమ డిమాండ్ అని ఘోష్ చెప్పారు. విపక్ష సభ్యులు అధ్యయనం చేసి సమగ్రంగా చర్చించడానికి అవకాశం ఇవ్వాలని తాము కోరినప్పటికీ ప్రభుత్వం తన దౌర్జన్యాన్ని ప్రదర్శించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని ఆమె ఆరోపించారు. భారతదేశ వ్యవసాయ కార్మికులకు ఈ రోజు అత్యంత విచారకరమైన రోజని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా అభివర్ణించారు.
ప్రజలు చూడడానికి వీల్లేకుండా మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను పార్లమెంట్ వెనుక భాగానికి ఈ ప్రభుత్వం తరలించిందని, అదే విధంగా మహాత్మా గాంధీ పేరును పథకం నుంచి తొలగించిందని డీఎంకే నాయకుడు తిరుచ్చి శివ విమర్శించారు. కాగా, అంతకుముందు వీబీ-జీ రామ్ జీ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించివేసి బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేయగా మూజువాణి ఓటుతో సభ బిల్లును ఆమోదించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఇరు సభలు ప్రారంభమైన వెంటనే వీబీ జీ రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నిరసన చేశారు. సభ కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో ఇరు సభల అధిపతులు సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బదులుగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) (వీబీ జీ రామ్ జీ) బిల్లు, పౌర అణు రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పించే శాంతి బిల్లు, బీమా రంగంలో నూటికి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించే బిల్లు వీటిలో ఉన్నాయి.
ఈ సమావేశాలు 19 రోజులపాటు 92 గంటల 25 నిమిషాలపాటు జరిగాయి. లోక్‌సభ శుక్రవారం సమావేశం కాగానే సభాపతి ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ సెషన్లో లోక్ సభ ఉత్పాదకత 111 శాతంగా నమోదైనట్లు తెలిపారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభలోనే ఉన్నారు. కొందరు సభ్యులు ‘మహాత్మా గాంధీ కీ జై’ అంటూ నినాదాలు చేశారు. 150 ఏండ్ల చరిత్ర కలిగిన జాతీయ గేయం ‘వందేమాతరం’, ఎన్నికల సంస్కరణలపైనా ఈ సమావేశాల్లో చర్చలు జరిగాయి.
వాయు కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చర్చ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, ఈ చర్చ జరగలేదు. 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినప్పటికీ, ఎన్నికల కమిషన్, దాని కార్యకలాపాలపై సభలో చర్చించజాలమని ప్రభుత్వం చెప్పింది. రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రతిపక్ష సభ్యుల తీరును తప్పుబట్టారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రవర్తన పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. ఈసారి రాజ్యసభ కార్యకలాపాలు 92 గంటలపాటు జరిగాయని, 121 శాతం ఉత్పాదతకత నమోదైందని వివరించారు. తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు.
విపక్షాల తీవ్ర నిరసనల మధ్య కార్మికులకు ఉపాధి కల్పించే ఎంజీనరేగా చట్టం స్థానంలో కేంద్రం వీబీ-జీ రామ్ జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన క్రమంలో, దీనికి సంబంధించిన ఒక విషయం బయటపడింది. ఎంజీనరేగా అధికారిక డాటా ప్రకారం ఈ పథకం కింద నమోదై ఉన్న 16.3 లక్షల మంది కార్మికులను కొద్ది నెలల క్రితమే జాబితా నుంచి తొలగించారు. బిల్లు ప్రవేశపెట్టడానికి నెల రోజుల ముందే ఇది జరిగిందని జాతీయ మీడియా వెల్లడించింది. కాగా, దీనిపై సమాజ్‌వాది పార్టీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేశ్ పాశ్వాన్ సమాధానం ఇస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జాబ్ కార్డులను తొలగించడం సాధారణంగా జరిగే ప్రక్రియేనని తెలిపారు.