Reels | న్యూఢిల్లీ, నవంబర్ 15: రైళ్లు, రైల్వే ప్లాట్‌ఫాంలు, మెట్రో రైళ్లలో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది.
వారు కోచ్‌లో కానీ, రైల్వే ప్రాంగణంలో కానీ రైల్వే కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తమ ఆదేశంలో పేర్కొంది. కొంతమంది ప్రమాదాలను సైతం లెక్క చేయకుండా వ్యూస్ కోసం డ్యాన్స్‌లు, ప్రమాదకర స్టంట్లతో రీల్స్ చేస్తున్నారు.
అవి తోటి ప్రయాణికులను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపై పలువురు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇటీవల రైల్వే ట్రాక్‌పై ఆగిపోయిన ఒక ఎస్యూవీ వాహనాన్ని చూసిన గూడ్స్ డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. తీరా అది ప్రమాదవశాత్తు ఆగిపోలేదని, ఒక స్టంట్‌కు సంబంధించి రీల్ కోసం దానిని ట్రాక్‌పై ఆపినట్టు తెలుసుకున్నారు. ఇలాంటివి దేశ వ్యాప్తంగా అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి.