Lockdown : పశ్చిమాసియా (West Asia) లో ఇరాన్ (Iran) పై అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత ఏర్పడుతున్నదనే ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) కోసం వాహనదారులు బారులు తీరుతున్నారు. మరోవైపు ‘లాక్డౌన్ (Lockdown)’ భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి (Petrolium Minister) హర్దీప్ సింగ్ పురీ (Hardeep Singh Puri) దీనిపై స్పష్టతనిచ్చారు. ‘లాక్డౌన్ ’ వార్తలను కొట్టిపారేసిన కేంద్రమంత్రి ఇంధన లభ్యతకు కేంద్రం చర్యలను వివరిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
‘అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఎనర్జీ, సరఫరా గొలుసు అత్యవసర సరకు రవాణా వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్‌పై వినిపిస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవం. అలాంటి ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదు. ఇలాంటి వదంతులు సమాజానికి హాని చేస్తాయి. గందరగోళం సృష్టిస్తాయి. ఈ సమయంలో మనమంతా ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐకమత్యంగా ఉండాలి’ అని కేంద్రమంత్రి స్పష్టంచేశారు.
‘గత నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 122 డాలర్ల వరకు వెళ్లొచ్చింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆగ్నేయాసియా దేశాల్లో 30-50 శాతం, ఉత్తర అమెరికాలో 30 శాతం, యూరప్‌లో 20 శాతం, ఆఫ్రికా దేశాల్లో 50 శాతం మేర ఇంధన ధరలు పెరిగాయి. కానీ మన దేశంలో పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ వీటిని పెంచలేదు. అంతేగాక చమురు కంపెనీలు అధిక నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వ పన్ను ఆదాయాన్ని తగ్గించుకున్నాం. అదే సమయంలో విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనంపై ఎగుమతి పన్ను విధించాం’ అని పురీ వెల్లడించారు.
విదేశాలకు ఎగుమతిచేసే డీజిల్‌పై లీటర్‌కు రూ.21.5 చొప్పున పన్ను విధించినట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఇక ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) పై లీటర్‌కు రూ.29.5 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపింది. వాస్తవానికి 2024లో కేంద్రం ఇంధన ఎగుమతులపై పన్నులను తొలగించింది. అయితే, ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వీటిని మళ్లీ ప్రవేశపెట్టింది. ఇదిలావుండగా పెట్రోల్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని రూ.13 నుంచి రూ.3 కు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. డీజిల్‌పై రూ.10 ఉన్న సుంకాన్ని పూర్తిగా ఎత్తేసింది.