కోల్కతా: ఎన్నికల అనంతర హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్ వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై శనివారం స్థానికులు దాడి చేశారు. టీఎంసీ ఎంపీపై రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు విసిరిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై పిడిగుద్దులు కురిపించేందుకు కూడా ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగింది.
ఈ ప్రాంతంలో పోలీసులు లేరు. వాళ్లు నన్ను చంపాలనుకున్నారు. పోలీసులు బాధితుల కుటుంబాలకు రక్షణ కల్పించే వరకు నేను ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టను అని ఎన్నికల అనంతర హింసాకాండలో మరణించిన ఒక బాధితుడి బంధువులను కలిసిన సందర్భంగా బెనర్జీ మీడియాతో అన్నారు.
ఈ ఘటనపై టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ స్పందిస్తూ పాలకులు హంతకులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సమీక్ స్పందిస్తూ సంవత్సరాలుగా హింసకు గురైన స్థానికుల ఆగ్రహం ఫలితంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని అన్నారు.