Bribe | న్యూఢిల్లీ: గడచిన ఏడాది కాలంలో తాము ముడుపులు చెల్లించినట్లు దాదాపు 66 శాతం వ్యాపార సంస్థలు అంగీకరించినట్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ ఆదివారం ఒక నివేదికలో తెలిపింది. 159 జిల్లాల వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 18,000 స్పందనలు వచ్చినట్లు పేర్కొంది. తాము బలవంతంగా ముడుపులు చెల్లించినట్లు 54 శాతం సంస్థలు తెలియచేయగా, తమ పని వేగవంతం అయ్యేందుకు తామే స్వచ్ఛందంగా ముడుపులు చెల్లించినట్లు 46 శాతం సంస్థలు వెల్లడించినట్లు నివేదిక తెలిపింది. ప్రభుత్వ శాఖల నుంచి పర్మిట్లు, అనుమతులు, లైసెన్సుల ప్రతులు, ఆస్తులకు సంబంధించిన ఏ వ్యవహారాలకైనా ముడుపులు చెల్లించడం ఆనవాయితీగా మారిందని అనేక వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి.
అనేక కార్యాలయాలలో కంప్యూటరీకరణ జరిగినప్పటికీ సీసీటీవీలకు దూరంగా రహస్యంగా వ్యాపార సంస్థల నుంచి ముడుపులు పుచ్చుకోవడం కొనసాగుతూనే ఉందని నివేదిక పేర్కొన్నది. మార్కెటింగ్ రంగంలో ఈ-ప్రొక్యూర్మెంట్ వంటి కొత్త విధానాలు అవినీతిని తగ్గించడానికి సరైన అడుగులే అయినప్పటికీ సరఫరాదారుగా అర్హత సాధించడం, టెండర్ ప్రక్రియలో అక్రమాలు, కంప్లీషన్ సర్టిఫికెట్లు, ప్రభుత్వం నుంచి చెల్లింపులు వంటి విషయాలలో అవినీతి అంతం కాలేదని తెలిపింది. ఈ ఏడాది మే 22 నుంచి నవంబర్ 30 మధ్య ఈ సర్వే జరిగింది.
న్యాయ, తూనికలు, ఆహార, ఔషధ, ఆరోగ్య తదితర శాఖలకు చెందిన అధికారులకు ఈ ముడుపులలో 75 శాతం వెళ్లినట్లు సర్వేలో తేలింది. జీఎస్టీ, కాలుష్య నియంత్రణ, మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్తు శాఖ అధికారులకు సైతం ముడుపులు చెల్లించినట్లు అనేక వ్యాపార సంస్థలు తెలియచేశాయి.