చెన్నై: కళలు, సాహిత్య పురస్కారాల్లో సైతం రాజకీయ జోక్యం ప్రవేశించడం ప్రమాదకరమని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ జోక్యం కారణంగా సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేశారని.. ఇలాంటి పరిస్థితుల్లో సాహిత్య సంస్థల ప్రతినిధులు, రచయితల విజ్ఞప్తి మేరకు తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున హిందీయేతర భాషల్లో అత్యుత్తమ రచనలకు ఏటా జాతీయ స్థాయి సాహిత్య పురస్కారాలను అందిస్తామని ఆదివారం చెన్నై అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఆయన ప్రకటించారు. సెమ్మొజి ఇల్లికియ విరుదు(శ్రేష్ఠమైన(క్లాసికల్) భాషా సాహిత్య పురస్కారం) పేరిట ఇచ్చే ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదును అందిస్తామన్నారు. మొదటి దశలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, బెంగాలీ, మరాఠీ భాషల రచనలకు పురస్కారాలు ఇస్తామని స్టాలిన్ తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చే సాహిత్య పురస్కారాల ఎంపిక కోసం స్వతంత్రత కలిగిన అనుభవజ్ఞులైన సాహితీ వేత్తలతో ప్రతి భాషకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
జల్లికట్టు విజేతలకు ప్రభుత్వ ఉద్యోగం
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టులో విజేతలైన వారికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బంపరాఫర్ ప్రకటించారు. మదురైలోని అళంగనల్లూరులో జరిగిన జల్లికట్టు క్రీడా కార్యక్రమానికి విచ్చేసిన ఆయన జల్లికట్టు పోటీలో ఎక్కువ ఎద్దులను లొంగదీసుకున్న క్రీడాకారులకు పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. జల్లికట్టు కోసం మదురైలో ఒక ప్రత్యేక కలైంజ్ఞర్ సెంటినరీ ఎరీనాను నిర్మించడం గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. కాగా, జల్లికట్టు అనేది తమిళనాడులో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ ఎద్దుల క్రీడ. ఇది ముఖ్యంగా పొంగల్ పండుగ సమయంలో నిర్వహిస్తారు.