న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ రభస జరిగింది. విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ కొత్త బిల్డింగ్కు చెందిన రాజ్యసభలో ఇవాళ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై విమర్శలు చేశారు. బలహీనంగా ఉన్న మహిళలకే పార్టీలు టికెట్లు ఇస్తాయన్నారు. సీట్లను గెలిచే శక్తివంతమైన మహిళలకు ఇవ్వరని ఆయన విమర్శలు చేశారు. షెడ్యూల్ తెగల మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉంటుందని, అందుకే రాజకీయ పార్టీలు అలాంటి బలహీనవర్గాలకు చెందిన మహిళలకు సీట్లు ఇస్తాయని, చదువుకుని పోరాటం చేసే తత్వం ఉన్న మహిళలకు సీట్లు ఇవ్వరని ఖర్గే విమర్శించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. మహిళలకు తమ పార్టీ సాధికారత కల్పించిందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ మహిళ అని, గిరిజన తెగకు చెందిన మహిళ అని ఆమె అన్నారు. సామర్థ్యం లేని మహిళల్ని ఎన్నుకున్నారన్న విషయం అమోదయోగ్యం కాదని మంత్రి పేర్కొన్నారు. మహిళా ఎంపీలందరికీ పార్టీ అండ ఉందని, ద్రౌపది ముర్ముకు కూడా పార్టీ అండ ఉందన్నారు.