ముంబై: విదేశీ మద్యం ధరలు పెరగడంతో మహారాష్ట్రలో మద్యం అమ్మకాలు పడిపోయి ఎక్సైజ్ సుంకం ద్వారా ఆదాయం తగ్గిపోయింది. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు15.1 కోట్ల లీటర్ల మద్యం అమ్మకాలు మాత్రమే జరిగాయి. ఇదే కాలంలో గత ఏడాది 32.19 కోట్ల లీటర్ల మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 30 కోట్ల లీటర్ల మద్యం అమ్మకాలు జరగగా 2023-24లో 27.72 కోట్ల లీటర్ల అమ్మకాలు జరిగాయి.
కొవిడ్-19 కాలంలో విదేశీ మద్యం అమ్మకాలు పుంజుకోవడం విశేషం. 2018-19లో 20.72 కోట్ల లీటర్లు, 2020-21లో 21 కోట్ల లీటర్ల విదేశీ మద్యం అమ్మకాలు జరిగాయి. ధరల పెంపు దేశీయ మద్యం అమ్మకాలపై ప్రభావం చూపింది. రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా పడిపోయింది. గత ఏడాది ఇదే కాలానికి రూ. 25,467 కోట్ల ఎక్సైజ్ ఆదాయం లభించగా ఈ ఏడాది రూ. 12,332 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. అయితే మద్యం అమ్మకాలు తగ్గడానికి ధరల పెంపు ఒక్కటే కారణం కాదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జీవన వ్యయం పెరగడం వల్ల ప్రజలు ఖర్చులు తగ్గించుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని, దీని ప్రభావం అత్యధికంగా మద్యంపై పడిందని అభిప్రాయపడ్డారు.