Liquor Price | హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, కర్ణాటకలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నది. అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించాలని చూస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖజానాను నింపుకొనేందుకు మద్యం ధరలు పెంచేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తున్నది. జూలై 1 నుంచి ప్రీమియం మద్యం బ్రాండ్ల ధరలను తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తగ్గింపు 10 శాతం వరకు ఉండనున్నట్టు సమాచారం. ప్రీమియం విదేశీ బ్రాండ్ల ధరలనూ 12 నుంచి 15 శాతం తగ్గించే అవకాశం ఉన్నది. ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచటం, రాష్ట్రంలోకి అక్రమంగా వస్తున్న మద్యం రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ధరలను తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ధరల తగ్గింపుపై అభ్యంతరాల కోసం ఏడు రోజుల గడువు ఇస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.
తెలంగాణలో 15 నుంచి 25 శాతం పెంపు?
తెలంగాణ ప్రభుత్వం అన్ని బ్రాండ్ల లికర్ ధరల మీద 15 నుంచి 20-25 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. మద్యం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందేందుకే నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. ధరలు పెంచితే ఏటా సరారుకు అదనంగా రూ.3 వేల నుంచి 3.5వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకా శం ఉన్నది. ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పడిన మంత్రివర్గం ఉపసంఘం ఇటీవలే సమావేశమైంది. ఏయే శాఖల నుంచి అదనంగా నిధుల సమీకరణ చేయొచ్చని చర్చ జరిగిందని, మద్యం రేట్ల పెంపు అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. అయితే, తక్షణమే పెంచుతారా? లేదా ? అనే దానిపై స్పష్టత రాలేదు. పెంపుపై త్వరలోనే విధివిధానాలను ఖరారు చేస్తారని తెలిసింది. ఒకే పార్టీకి చెందిన రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు.. ఒకచోట మద్యం ధరలు తగ్గిస్తుంటే, మరోచోట పెంచటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.