e-mail Aadhar link | ప్రస్తుతం ఆధార్ కార్డ్ చాలా ప్రముఖమైన డాక్యుమెంట్‌గా తయారైంది. ఏ పనికి వెళ్లినా ఆధార్ కార్డును జత చేయాల్సి వస్తున్నది. దాంతో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. ఆధార్ కార్డు తీసుకుని పదేండ్లు దాటిన వారు కార్డును అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ ఇటీవల వినియోగదారులకు సూచించింది. ఆధార్ కార్డుతో ఈ-మెయిల్ ఐడీని లింక్ చేయడం ద్వారా పలు బెనిఫిట్స్ పొందవచ్చునని యూఐడీఏఐ తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి సమాచారాన్ని యూఐడీఏఐ షేర్ చేసింది.
ఆధార్ కార్డును ఈ-మెయిల్ ఐడీతో లింక్ చేయడం వల్ల మన ఆధార్ కార్డును ఎక్కడ ఉపయోగిస్తున్నారనేది తెలుసుకోవడం సులువవుతుంది. మన అనుమతి లేకుండా ఆధార్ కార్డును వాడుతున్న సందర్భంలో మన ఈ-మెయిల్‌కు సమాచారం అందుతుంది. దీంతో నేరాలను చాలా వరకు నిరోధించవచ్చు. ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి మోసం జరిగిన సందర్భాల్లో సమాచారం పొందేందుకు వీలుంటుంది. తద్వారా ఇలాంటి మోసాలను అరికట్టేందుకు బ్యాంకు సిబ్బందితో సహకరించవచ్చు.
సైబర్ నేరగాళ్లు ఆధార్‌ను దుర్వినియోగం చేస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. నేర కార్యకలాపాల్లో కూడా ఆధార్‌ను విరివిగా వాడుతున్నారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ఆధార్‌ను ఈ-మెయిల్‌తో లింక్ చేయాలని యూఐడీఏఐ ఈ సలహా ఇస్తున్నది. ఆధార్‌ను ఈ-మెయిల్‌తో లింక్ చేయడానికి ఆధార్ కేంద్రానికి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుందని సూచించింది.