న్యూఢిల్లీ, అక్టోబర్ 25 / (స్పెషల్ టాస్క్ బ్యూరో): ఆప్త మిత్రుడు అదానీని, అప్పుల్లో ఉన్న ఆయన కంపెనీలను ఆర్థికంగా కాపాడేందుకు సామాన్యుల సొమ్మును రిస్క్‌లో పెట్టడానికి మోదీ ప్రభుత్వం సిద్ధపడిందా? అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అదానీ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు రాకపోవడంతో.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీని బలి పెట్టాలనుకొన్నదా? ఇందుకుగానూ చెమటోడ్చి సామాన్యులు దాచుకొన్న డబ్బులను దుర్వినియోగం చేయాలనుకొన్నదా? అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఐసీపై ఆర్థిక శాఖ అధికారులు ఒత్తిళ్లు తీసుకొచ్చినట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత దినపత్రిక ‘ది వాషింగ్టన్ పోస్ట్’ తాజా కథనంలో వెల్లడించడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది.అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన కొందరు
ఉన్నతాధికారులు ఎల్ఐసీపై ఒత్తిళ్లు తీసుకొచ్చినట్టు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక పేర్కొంది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్, సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కాంట్రాక్టులకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకొన్నవే. ఈ విషయం తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ అధికారులు పెట్టుబడులపై ముందుకే వెళ్లినట్టు పత్రిక తెలిపింది. ఈ క్రమంలోనే ఎల్ఐసీ నుంచి దాదాపు 390 కోట్ల డాలర్ల (రూ.34,251 కోట్ల) నిధులను అదానీ గ్రూప్‌లో పెట్టుబడులుగా పెట్టాలన్న ప్రతిపాదనలకు గత మేలో కేంద్ర ఆర్థిక శాఖ హడావుడిగా ఆమోదం తెలిపినట్టు పత్రిక వెల్లడించింది. అదానీ కంపెనీ కొన్ని రుణాలను డాలర్ల రూపంలో చెల్లించాల్సి రావడంతోనే ఈ ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్టు వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టులు ప్రాంశు వర్మ, రవి నాయర్ తమ కథనంలో తెలిపారు. అదానీ గ్రూప్ కంపెనీలలో ఈక్విటీని పెంచడానికి ఎల్ఐసీ నిధులను ఉపయోగించాలని కూడా అధికారులు సిఫార్సు చేసినట్లు పత్రిక ఈ సందర్భంగా తెలిపింది.
భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టడానికి 2021లో అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్ట్ టెండర్లు దక్కించుకోవడానికి ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు రూ.2,238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేశారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తన ఆరోపణల్లో వెల్లడించింది. తద్వారా వచ్చే 20 ఏండ్లలో కనిష్ఠంగా 2 బిలియన్ డాలర్లను లబ్ధి పొందేందుకు అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆరోపించింది.
ఈ లంచం సొమ్మును సేకరించడానికి అమెరికాలోని బ్యాంకులు, పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలిపింది. ఈ కేసులో నిందితులు ఎఫ్బీఐతోపాటు తమ దర్యాప్తును అడ్డుకోవడానికి కూడా కుట్ర పన్నినట్టు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) ఆరోపించింది. ఈ కేసు ఇంకా కొనసాగుతున్నది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఏవీ ముందుకు రాలేదు. అప్పుల భారం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఐసీపై ఆర్థిక శాఖ వర్గాలు ఒత్తిళ్లు తెచ్చినట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనాన్ని బట్టి అర్థమవుతున్నది.
అదానీ గ్రూప్ బకాయిపడ్డ రుణాలను డాలర్ల రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏర్పడిందని, ఈ క్రమంలోనే ఎల్ఐసీపై ఒత్తిళ్లు వచ్చాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే నెలలో గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) రూ. 5 వేల కోట్లకుపైగా విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (ఎన్సీడీ) జారీ చేసింది. వాటిని ఎల్ఐసీ పూర్తిగా సబ్‌స్ర్కైబ్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.
ఈ మొత్తాన్ని ఎల్ఐసీ డాలర్ల రూపంలో చెల్లించినట్టు సమాచారం. అంటే, ఎన్సీడీ ద్వారా సమకూరిన ఎల్ఐసీ డబ్బును.. అదానీ కంపెనీ డాలర్ల రూపంలో రుణాల కోసం మళ్లించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే 30న అదానీ కంపెనీ ఎన్‌సీడీని జారీ చేయడం, వాటిని పూర్తిగా ఎల్ఐసీ సబ్‌స్ర్కైబ్ చేయడం కేంద్రం ఒత్తిళ్లలో భాగమేనా? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా మోదీ ప్రభుత్వ చర్యలతో ఎల్ఐసీలో సామాన్యులు దాచుకొన్న సొమ్ము రిస్క్‌లో పడినట్టేనని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల సొమ్ముతో మోదీ ప్రభుత్వం ఒక రకంగా జూదమే ఆడిందని మండిపడుతున్నారు.
ఎల్ఐసీ, కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌కు నోడల్ డిపార్ట్మెంట్గా వ్యవహరించే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) నుంచి పొందిన కొన్ని విలువైన పత్రాల ఆధారంగా వాషింగ్టన్ పోస్ట్ ఈ పరిశోధన సాగించింది. ఈ ఏజెన్సీలకు చెందిన మాజీ అధికారులు, ప్రస్తుత ఉన్నతాధికారులు, అదానీ గ్రూప్ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే మూడు బ్యాంకులకు చెందిన అధికారులను ఇంటర్వ్యూ చేసి వాషింగ్టన్ పోస్ట్ ఈ కథనాన్ని ప్రచురించింది.
అదానీ గ్రూప్‌లో పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిళ్లూ లేవని ఎల్ఐసీ స్పష్టం చేసింది. ‘వాషింగ్టన్ పోస్ట్’ ఆరోపణలు నిరాధారమని, పెట్టుబడులపై తమదే తుది నిర్ణయమని పేర్కొంది. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖగానీ ఇతరుల ప్రమేయంగానీ ఏమీ లేవని వెల్లడించింది. ‘వాషింగ్టన్ పోస్ట్’ ఆరోపణలు ఆవాస్తవమని అదానీ గ్రూప్ కూడా ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, 30 కోట్ల మంది ఎల్ఐసీ పాలసీదారుల సేవింగ్స్‌ను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విపక్ష కాంగ్రెస్ మండిపడింది. ఈ ఉదంతంపై పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసింది. అయితే, ఈ ఉదంతంపై కేంద్రం ఇంకా స్పందించాల్సి ఉన్నది.
