శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 26, 2020 , 18:48:49

స్వచ్ఛ రాజకీయాలను ప్రోత్సహిద్దాం: వెంకయ్య నాయుడు

స్వచ్ఛ రాజకీయాలను ప్రోత్సహిద్దాం: వెంకయ్య నాయుడు

హైదరాబాద్ : ప్రజాజీవితంలో ఉన్నవారిలో నైతికత, విలువల పతనం పట్ల ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థ పూర్తిగా పతనం కాకముందే, అన్ని రాజకీయ పార్టీలు తమ సభ్యుల్లో, వ్యవస్థలో నైతికతను, విలువలను పెంపొందించేందుకు కృషిచేయాల్సిన తక్షణావసరం ఉన్నదని సూచించారు. తద్వారా స్వచ్ఛ రాజకీయాలను ప్రోత్సహించాలన్నారు. హైదరాబాద్‌లో శనివారం ‘ప్రజాస్వామ్య ఏకాభిప్రాయ నిర్మాణం – వాజ్‌పేయి మార్గం’ ఇతివృత్తంతో ‘ఇండియా ఫౌండేషన్’ నిర్వహించిన మూడో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసానికి ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రతి రాజకీయ పార్టీ తమ కార్యకర్తలు, పార్టీ తరపున ఎన్నికైన చట్టసభ్యులు ప్రతిఅడుగులోనూ నైతికంగా జీవించేలా చొరవతీసుకోవాలని సూచించారు. 

అధికారం కోసం అంగబలాన్ని, అర్థబలాన్ని దుర్వినియోగం చేస్తూ సిద్ధాంతమనేది లేకుండా రాజకీయాలు సాగుతుండటం వంటి పెడధోరణులు మంచివి కావని వెంకయ్యనాయుడు హితవు పలికారు. నేరప్రవృత్తి గలవారు రాజకీయాల్లోకి రావడం కారణంగా హింస పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినంగా, ప్రభావవంతంగా అమలుచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి.. చట్టసభల ప్రిసైడింగ్ అధికారులు.. పార్టీ ఫిరాయింపుల వివాదాలను దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచకుండా మూడు నెలల్లోపే విచారించేలా చొరవతీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను తొలగించాలని, ‘సౌకర్యవంతమైన రాజకీయాలు’ అనే విధానానికి స్వస్తి పలికి.. వాజ్‌పేయి చూపించిన ‘విశ్వాస వంతమైన రాజకీయాల’ను, ‘రాజకీయ ఏకాభిప్రాయం’ నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. 

అటల్ జీ భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ప్రధానమంత్రిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. నిష్కళంకమైన వ్యక్తిత్వం, ఉన్నతస్థాయి నైతిక విలువలు, తను నమ్మిన సిద్ధాంతం, విలువల విషయంలో రాజీపడని తత్వంతోపాటు.. నిరాడంబరత, గౌరవ, మర్యాదలను కలబోసిన మహోన్నత వ్యక్తిత్వంతో వాజ్‌పేయి ప్రజల మనసులను గెలుచుకున్నారన్నారు. అంతటి మహనీయుడు చూపిన బాటను, ఆచరించిన విలువలను కొనసాగించడమే ఆయనకిచ్చే గొప్ప నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు వైస్ అడ్మిరల్ శేఖర్ సిన్హా, ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ సభ్యుడు శౌర్య దోవల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి, ఇండియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడు రాంమాధవ్‌తోపాటు వివిధ రంగాల ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo