Supreme Court : మరణశిక్ష (Death Punishment) పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత విధానాన్ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరిపింది. అయితే మరణశిక్ష అమలులో ఉరితీత విధానాన్ని మార్చే ఉద్దేశం లేదని కేంద్రం (Union Govt) కోర్టుకు తెలిపింది. దాంతో ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. కాలానుగుణంగా మార్పులను తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేకపోవడమే ఇక్కడ సమస్య అని వ్యాఖ్యానించింది.
సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు. మరణశిక్ష పడిన ఖైదీకి కనీసం ఉరితీతా? లేదంటే ప్రాణాంతక ఇంజెక్షనా? అనే ఆప్షన్ ఎంచుకునే అవకాశమైనా ఇవ్వాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. అమెరికాలోని 49 రాష్ట్రాలు మరణశిక్ష అమలులో ప్రాణాంతక ఇంజెక్షన్ విధానాన్ని అనుసరిస్తున్నాయని, దానివల్ల మరణ సమయంలో శిక్షపడ్డ నేరస్థుడికి తక్కువ వేదన ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలిందని పిటిషనర్ పేర్కొన్నారు.
దాంతో సుప్రీం ధర్మాసనం.. పిటిషనర్ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలలని, దాన్ని పరిగణించేలా చూడాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదికి సూచించారు. అయితే పిటిషనర్ సూచన సాధ్యమయ్యేది కాదని, దాన్ని ఇప్పటికే తమ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్నామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇది విధానపరమైన నిర్ణయమని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం నిపుణుల కమిటీ ఏర్పాటుచేసే అంశాన్ని గతంలో పరిశీలించినట్లు తెలిపారు.
ప్రభుత్వ తరఫు న్యాయవాది సమాధానంపై ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసింది. కాలానుగుణంగా ఎన్నో అంశాల్లో మార్పులు వచ్చాయని, కానీ ప్రభుత్వం మాత్రం ఆ మార్పులను స్వీకరించేందుకు సిద్ధంగా లేదని, అదే ఇక్కడ సమస్యగా మారిందని వ్యాఖ్యానించింది. అయితే ప్రస్తుతానికి దీనిపై తాము ఎలాంటి విధానపరమైన ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను నవంబర్ 11కు వాయిదా వేసింది.