Rahul Gandhi | జమ్ముకశ్మీర్‌లో భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ విమర్శలు ఎక్కు పెట్టారు. `ఒకవేళ భదత్రా పరిస్థితి బాగుంటే బీజేపీ నేతలు జమ్ము నుంచి లాల్‌చౌక్ వరకు వాకింగ్ ఎందుకు చేయరు` అని ఆదివారం ప్రశ్నించారు. జమ్ము కశ్మీర్లో నిరంతరం బాంబు దాడులు, ఉగ్రవాదుల దాడులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. `ఒకవేళ జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు సురక్షితంగా ఉంటే, కేంద్ర హోంమంత్రి ఎందుకు జమ్ము నుంచి లాల్ చౌక్ వరకు నడవరు` అని అన్నారు. భద్రతా వైఫల్యం పేరుతో శుక్రవారం రాహుల్ గాంధీ తన జోడో యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించినప్పటి నుంచి ఆయన భద్రత అంశం తరుచుగా ప్రస్తావనకు వచ్చింది. సోమ వారం భారత్ జోడోయాత్ర ముగింపు సభ జరుగనున్నది. ఇదిలా ఉండగా, జమ్ముకశ్మీర్ పోలీసులు మాత్రం రాహుల్ భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించడంలో ఎటువంటి లోపాలు లేవని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్‌కు నిరాధార ప్రకటన చేస్తున్నారని బీజేపీ ఎదురు దాడికి దిగింది.
ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ బానిహాల్ నుంచి క్వాజిగుండ్‌కు రాహుల్ గాంధీ, ఆయనతోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా భారత్ జోడో యాత్ర వచ్చినప్పుడు భారీగా జనం వచ్చి పడ్డారు. ఆ తరుణంలో రాహుల్ గాంధీ భద్రతా వలయం.. జన సమూహాన్ని నివారించడంలో విఫలమైంది. దీంతో భారత్ జోడో యాత్ర నిలిపేయాలని రాహుల్‌కు సూచించింది.