లక్నో: పలువురిపై దాడి చేసి గాయపర్చిన చిరుతను స్థానికులు పట్టుకున్నారు. ఆ తర్వాత దారుణంగా ప్రవర్తించారు. దాని గొంతునొక్కి చంపారు. (Leopard Strangled) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటవీశాఖ అధికారులు వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం నౌతన్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్దా తోలా లాల్పూర్ గ్రామ సమీపంలో చిరుతపులి కనిపించింది. కొంతమంది యువకులు దానిని వెంబడించారు. దీంతో ఆ చిరుత రోహిన్ నదిలోకి దూకింది.
కాగా, కొందరు వ్యక్తులు ఆ నదిలోకి దిగారు. వృద్ధాప్యం వల్ల అనారోగ్యంతో కనిపించిన ఆ చిరుతను పట్టుకున్నారు. దానిని బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత కొందరు యువకులు ఆ చిరుత గొంతు నొక్కి చంపారు. అక్కడున్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిరుతను గొంతు నొక్కి చంపడంపై నెటిజన్లు మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అటవీశాఖ అధికారులు స్పందించారు. చిరుత మృతదేహాన్ని గోరఖ్‌పూర్ జూ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం అక్కడ ఖననం చేశారు. వృద్ధాప్యం వల్ల బలహీనంగా ఉన్న ఆ చిరుతను గొంతు నొక్కి చంపిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
The self-reliant villagers in Lalpur, Maharajganj, captured a leopard after forest officials failed to act. Their brave efforts went viral, prompting official intervention. Kudos to their adventurous spirit!
💪 https://t.co/mA7S0PgKKc— VIKAS THAKUR ‘क्षत्रिय’ (@vikas6918) December 3, 2024