న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశంలో మరో రాష్ట్రం అగ్నిగుండమైంది. జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్, రైతుల ఉద్యమంతో పంజాబ్, హర్యానా అట్టుడుకగా, తాజాగా రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్‌తో లద్దాఖ్ భగ్గుమంది. నేపాల్ నిరసనలను గుర్తుకుతెస్తూ జనరేషన్ జెడ్ యువత ఈ ఆందోళనలు నిర్వహించింది. లద్ధాఖ్‌కి రాష్ట్రహోదా కల్పించడంతోపాటు, ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు బుధవారం లెహ్‌లో నిర్వహించిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణల్లో నలుగురు మరణించగా,70 మందికిపైగా గాయపడ్డారు. లెహ్ నగరంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఆందోళనకారులు స్థానిక బీజేపీ కార్యాలయాన్ని, ఓ వాహనాన్ని తగలబెట్టి, విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతోపాటు లాఠీచార్జీ చేశారు. లెహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ)కి చెందిన యువజన విభాగం ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం లద్దాఖ్‌లో నిరసనలు జరిగాయి.
పూర్వ జమ్ముకశ్మీరు రాష్ట్రంలో భాగమైన లద్దాఖ్ 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారి నేరుగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్లింది. అప్పటి నుంచి జమ్ము కశ్మీరుతోపాటు లద్దాఖ్‌కి కూడా రాష్ట్ర హోదా ప్రకటించాలన్న డిమాండ్లు కొనసాగుతున్నాయి. వాతావరణ హక్కుల కార్యకర్త సోనం వాంగ్‌చుక్ నాయకత్వంలో నిరాహార దీక్ష చేస్తున్న 15 మందిలో ఇద్దరు వ్యక్తుల ఆరోగ్యం క్షీణించడంతో వారిని సెప్టెంబర్ 10న దవాఖానకు తరలించిన దరిమిలా ఎల్ఏబీ యువజన విభాగం బంద్‌కి పిలుపు ఇచ్చింది. కాగా, మంగళవారం తన 15 రోజుల దీక్షను విరమించిన వాంగ్‌చుక్ హింసకు పాల్పడవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత లెహ్‌లో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు దాని ఎదుట నిలిపి ఉన్న భద్రతా సిబ్బంది వాహనాన్ని దగ్ధం చేశారు.
ఎల్ఏబీకి చెందిన సభ్యులతోసహా లద్దాఖ్ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం మధ్య అక్టోబర్ 6న తాజా విడత చర్చలు జరగనున్నాయి. అయితే నిరాహార దీక్ష కొనసాగుతున్న దృష్ట్యా చర్చల తేదీని ముందుకు తీసుకురావాలని నిరసనకారులు డిమాండు చేశారు. మద్దతుదారులను ఉద్దేశించి వాంగ్‌చుక్ మాట్లాడుతూ యువత హింసను, ఘర్షణలను వీడాలని పిలుపునిచ్చారు. తాము నిరశన దీక్షను ముగిస్తున్నామని ఆయన చెప్పారు. నిరసనకారులపై బాష్ప వాయు గోళాలను ప్రయోగించవద్దని ఆయన పాలనా యంత్రాంగాన్ని అర్థించారు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోతే నిరాహార దీక్ష ఫలప్రదం కాదని ఆయన తెలిపారు. కాగా, ఆందోళన కారణంగా ఆదివారం ప్రారంభమైన నాలుగు రోజుల లద్దాఖ్ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమం రద్దయ్యింది. అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని పాలనా యంత్రాంగం ప్రకటించింది.
రాష్ట్ర హోదా కోసం జరిగిన నిరసనల సందర్భంగా హింసాకాండ, ప్రాణనష్టం సంభవించడానికి స్వార్థపర శక్తులు బాధ్యులని లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా బుధవారం ఆరోపించారు. మరింత రక్తపాతం జరగకుండా నివారించేందుకు లెహ్ జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ విధించినట్లు ఆయన తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించామని, మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియచేస్తున్నానని ఆయన తెలిపారు. మరిన్ని మరణాలు సంభవించకుండా నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని గుప్తా హామీ ఇచ్చారు. హింసను ఏ రూపంలోనూ సహించే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. అరాచక శక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులు, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
రాష్ట్ర హోదా నిరాకరిస్తే జమ్ము కశ్మీరు ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయో లెహ్ పట్టణంలోని పరిస్థితిని చూసి కనువిప్పు కలగాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కోసం జరుగుతున్న ఆందోళన హింస, దహనకాండ, వీధి ఘర్షణలకు దారితీసి నలుగురు మరణించగా, 22 మంది పోలీసులతోసహా 45 మంది గాయపడడం వంటి పరిణామాలపై ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ లద్దాఖ్‌కు రాష్ట్ర హోదాపై ఎటువంటి వాగ్దానం లేదని, 2019లో కేంద్ర పాలిత ప్రాంతం హోదాను ఇచ్చినందుకు అక్కడి వారు సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు తమకు ద్రోహం జరిగిందని వారు మండిపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తాము ప్రజాస్వామికంగా, శాంతియుతంగా, బాధ్యతాయుతంగా డిమాండు చేస్తున్నప్పటికీ జమ్ము కశ్మీరుకు రాష్ట్ర హోదాపై ఇచ్చిన వాగ్దానం నెరవేర్చనందుకు తాము ఎంత విద్రోహానికి గురయ్యామో, నిరాశచెందామో అని కశ్మీరు ప్రజలు ఎంత మనోవేదనకు గురవుతున్నారో మీరే ఊహించుకోవాలని ఆయన తెలిపారు. పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి లద్దాఖ్ పరిస్థితిపై స్పందిస్తూ అక్కడ ఏర్పడిన సమస్యలకు మూల కారణాన్ని పరిష్కరించాల్సిన సమయం కేంద్రానికి అనివార్యంగా మారిందని అన్నారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కోసం శాంతియుత నిరసనలకు సారథ్యం వహించిన వాతావరణ పరిరక్షణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ బుధవారం లెహ్ పట్టణంలో జరిగిన హింసాకాండపై స్పందిస్తూ యువజనుల ఆగ్రహమే వారిని వీధుల్లోకి రప్పించిందని తెలిపారు. దీనిని ఇటీవల నేపాల్‌లో జరిగిన జెన్-జీ విప్లవంతో ఆయన పోల్చారు. గడచిన ఐదేళ్లుగా యువజనులు ఉపాధి లేక అల్లాడుతున్నారని, ఏదో ఒక సాకుతో వారిని ఉద్యోగాల నుంచి వెళ్లగొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. లద్దాఖ్‌కి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, దీంతో ఇది సామాజిక అశాంతికి దారితీసిందని వాంగ్‌చుక్ తెలిపారు. ఇది ముమ్మాటికీ జెన్-జీ విప్లవమని ఆయన స్పష్టం చేశారు.