చండీగఢ్: చికిత్సలో భాగంగా వైద్యులు ఇచ్చే మందుల చీటీ కచ్చితంగా అర్థమయ్యేలా ఉండాలని, స్పష్టమైన వైద్య ప్రిస్క్రిప్షన్, రోగ నిర్ధారణలు పొందడం రోగి హక్కని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగబద్ధమైన ఆరోగ్య హక్కులలో ఇది ఉందని స్పష్టం చేసింది. ‘మందుల చీటీ, రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య పత్రాలు, అందుతున్న చికిత్స గురించి తెలుసుకునే హక్కు ప్రతి రోగికి ఉంది.
దీంతో ఆ డాక్యుమెంట్లు స్పష్టమైన రాతలో ఉండాలి. అందులోని విషయం రోగికి స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి’ అని జస్టిస్ జస్గురుప్రీత్ ఈనెల 27న తీర్పు చెప్పారు. ఒక కేసులో మెడికో లీగల్ నివేదిక అర్థం కాని రాతలో ఉండటంతో కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి విచారించింది.