Udaipur : స్టార్ హోటల్ లో గది తీసుకున్న ఒక జంట ప్రైవసీకి భంగం కలిగించి, ఇబ్బంది పెట్టినందుకు ఒక హోటల్ యాజమాన్యానికి రూ.10 లక్షల జరిమానా విధించింది చెన్నై వినియోగదారుల కమిషన్. చెన్నైకు చెందిన ఒక జంట గత ఏడాది ఉదయ్ పూర్లోని స్టార్ హోటల్ అయిన లీలా ప్యాలెస్ లో ఒక రూం తీసుకున్నారు. రోజుకు రూ.55,000 చెల్లించి ఒక రోజు గ్రాండ్ రూం విత్ లేక్ వ్యూ ఫెసిలిటీ కలిగిన రూం బుక్ చేసుకున్నారు. ఆ జంట హోటల్ లోని తమ రూం బాత్ రూంలో ఉండగా.. సిబ్బంది అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించారు.
తమ దగ్గరున్న మాస్టర్ కీతో హౌజ్ కీపింగ్ స్టాఫ్ ఒకరు లోపలికి ఎంటర్ అయ్యాడు. అంతేకాదు.. తమకు సర్వీస్ అక్కర్లేదని చెప్పినా వినిపించుకోకుండా పగిలిన బాత్ రూమ్ డోర్లోంచి తొంగి చూసేందుకు ప్రయత్నించారని ఆ జంజ తెలిపింది. దీనిపై ఆ కపుల్.. హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. అయితే, అందులో తప్పేంలేదని, హోటల్ సిబ్బంది రూల్స్ ప్రకారమే గదిలోకి వచ్చారని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. దీంతో విస్తుపోయిన జంట.. హోటల్ సిబ్బంది తమ ప్రైవసీ (ఏకాంతం)కి భంగం కలిగించారని, సేవల్లో లోపాలున్నాయని చెబుతూ చెన్నై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసింది. గత ఏడాది జనవరిలో ఈ ఫిర్యాదు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ జంట తమ రూం వద్ద ‘డు నాట్ డిస్టబ్’ అనే బోర్డు పెట్టలేదని, అందువల్లే తమ స్టాఫ్ గదిలోకి ఎంటర్ అయ్యారని హోటల్ యాజమాన్యం చెప్పింది.
వారు వాష్ రూమ్లో ఉన్నట్లు గమనించిన స్టాఫ్ వెంటనే బయటకు వచ్చారని హోటల్ తరఫు సిబ్బంది కోర్టుకు తెలిపింది. అయితే, హోటల్ తరఫున చేసిన వాదనను కోర్టు అంగీకరించలేదు. జంట ఏకాంతానికి భంగం కలిగించినందుకు, అలాగే సేవల్లో లోపాలకుగాను.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు.. వారు చెల్లించిన రూ.55,000కు ఏడాది తొమ్మిది శాతం వడ్డీ కలిపి చెల్లించాలని, అలాగే లిటిగేషన్ చార్జీల కింద మరో రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది.