న్యూఢిల్లీ: ఢిల్లీలో బుధవారం కురిసిన భారీ వర్షం అటు జనజీవనాన్ని స్తంభింపచేయగా, వందల కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం అసలు రంగును బయటపెట్టింది. భవనం రూఫ్ నుంచి నీరు కారడం ప్రారంభించింది. పార్లమెంట్ భవనం లాబీలో వర్షం నీరు లీకేజీలను గుర్తించిన పార్లమెంట్ సభ్యులు విస్తుపోయారు. రూ.971 కోట్లతో ఏడాది క్రితమే నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలో లీకేజీలు ఏమిటంటూ మండిపడ్డారు.
బయట పేపర్ లీకేజీ..లోపల వాటర్ లీకేజీ
పార్లమెంట్ ప్రాంగణంలో నీటి లీకేజీపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. ‘బయట పేపర్ లీకేజీ.. లోపల వాటర్ లీకేజీ’ అంటూ ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ఈ భవనం మోదీ అహంకారానికి ప్రతీకగా నిలిచే భయంకరమైన భవనం అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా విమర్శించారు. ‘కొత్త పార్లమెంట్ భవనం కన్నా పాతదే బాగుంది’ అంటూ ఎస్పీ చీఫ్ అఖిలేశ్ పేర్కొన్నారు.