తిరువనంతపురం, మే 4: కేరళలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఓటమి చెందడంతో పదేండ్ల విరామం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అధికారం చేపట్టనుంది. అలాగే బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించి బోణీ కొట్టింది. కేరళలో ఎల్డీఎఫ్ ఓటమితో దేశంలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ర్టాన్ని కూడా వామపక్షం కోల్పోయినట్టయ్యింది. వామపక్షం ఎక్కడా కూడా అధికారంలో లేకపోవడం ఐదు దశాబ్దాల కాలంలో ఇదే మొదటిసారి. పదేండ్ల పినరయి పాలనకు రాష్ట్ర ప్రజలు బ్రేక్ వేశారు. 140 స్థానాలున్న కేరళలో సోమవారం వెలువడిన ఫలితాలలో యూడీఎఫ్ 99, సీపీఐ (ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 35 స్థానాల్లో, బీజేపీ (ఎన్డీఏ) మూడు స్థానాల్లో విజయం సాధించాయి.
యూడీఎఫ్ వేవ్‌లో 13 మంది క్యాబినెట్ స్థాయి మంత్రులు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ పార్టీలైన సీపీఐ (ఎం) పలు స్థానాల్లో ఓడిపోగా, కేరళ కాంగ్రెస్ (ఎం) అయితే సున్నాకు పరిమితమైంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల, విపక్ష నేత వీడీ సతీశన్ తమ స్థానాల్లో విజయం సాధించారు. కాగా, ముఖ్యమంత్రి పినరయి విజయన్, పీఏ మహ్మద్ రియాస్, కే రాజన్, జీఆర్ అనిల్, కేఎన్ బాలగోపాల్, పీ ప్రసాద్ సాయి చెరియన్ మాత్రమే ఈ ఎన్నికల్లో విజయం సాధించగా, మిగతా మంత్రులంతా ఓడిపోయారు. ఎల్డీఎఫ్ కన్వీనర్ టీపీ రామకృష్ణన్ కూడా కోజికోడ్ జిల్లాలోని పెరంబరలో ఓటమిపాలయ్యారు. తిరువనంతపురం జిల్లాలోని నేమామ్, కజకొట్టంలలో, కొల్లాంలోని చత్తనూర్లలో బీజేపీ విజయం సాధించింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం విజయన్ అహంకారం, అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. 10 ఏండ్ల దుష్టపాలనకు ప్రజలు తగు విధంగా బుద్ధి చెప్పారని అన్నారు. తాము ఒక్క సీటు కూడా ఈ ఎన్నికల్లో నెగ్గమంటూ అటు అధికార ఎల్డీఎఫ్, ఇటు విపక్షం చేసిన ప్రచారం తప్పని మూడు స్థానాల్లో విజయం సాధించడం ద్వారా నిరూపించామని బీజేపీ నేత చంద్రశేఖర్ పేర్కొన్నారు. అధికార పార్టీ అవినీతి, శబరిమల ఆలయంలో బంగారం చోరీ తదితర అంశాల పట్ల ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని, వామపక్ష కూటమి పరాజయం ఊహించిందేనని ఆయన తెలిపారు.
దశాబ్దం తర్వాత కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 140 స్థానాలకుగాను 99 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఇప్పుడు కేరళ కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చ సాగుతున్నది. వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల, శశిథరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పరవూర్ నుంచి విజయం సాధించిన వీడీ సతీశన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అలప్పుజ ఎంపీ కేసీ వేణుగోపాల్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఎల్డీఎఫ్ గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన రమేశ్ చెన్నితల సీఎం రేసులో ఉన్నారని తెలిసింది. మంచి వక్తగా పేరున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేరు కూడా వినిపిస్తున్నది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఆయనకు మైనస్‌గా మారాయి. పార్టీ, కూటమి ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు తదుపరి సీఎం ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
