నాసిక్: లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎల్సీఏ) తేజస్ ఎంకే 1ఏ(LCA Tejas Mk 1A) యుద్ధ విమానం .. మహారాష్ట్రలోని నాసిక్ ఎయిర్‌బేస్‌లో ఎగిరింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు చెందిన మూడవ ఉత్పత్తి కేంద్రం నుంచి ఆ విమానాన్ని తయారీ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఈ విమానం తన విన్యాసాలు ప్రదర్శించింది. ఎల్సీఏ ఎంకే 1ఏకు చెందిన మూడవ ప్రొడక్షన్ లైన్‌ను మంత్రి ప్రారంభించారు. దీంతో పాటు హిందుస్తాన్ టర్బో ట్రైనర్-40(హెచ్‌టీటీ-40)కి చెందిన రెండో ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఆయన స్టార్ట్ చేశారు. హిందుస్థాన్ టర్బో ట్రైనర్ విమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి డెవలప్ చేశారు. భారతీయ వైమానిక దళం కోసం దీన్ని వినియోగించనున్నారు.
ఎల్సీఏ తేజస్ ఎంకే 1ఏ యుద్ధ విమానానికి నాసిక్ ఎయిర్‌బేస్‌లో వాటర్ సెల్యూట్ చేశారు. తేజస్ ఫైటర్ విమానాలను ఇప్పటికే బెంగుళూరులోని రెండు కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అక్కడ ప్రతి సంవత్సరం 16 విమానాలను తయారు చేస్తున్నారు. అయితే కొత్తగా నాసిక్‌లోనూ ప్రొడక్షన్ కేంద్రాన్ని మొదలుపెట్టారు. సుమారు 150 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని స్థాపించారు. ఇక్కడ నుంచి కూడా ప్రతి ఏడాది కొత్తగా 8 తేజస్ యుద్ధ విమానాలు తయారీ అవుతాయి. దీంతో యుద్ద విమానాల ఉత్పత్తి సామర్థ్యం 24కు పెరగనున్నది.
ఎల్సీఏ ఎంకే 1ఏ అడ్వాన్స్డ్, మల్టీరోల్ ఫైటర్ విమానం. మిగ్21 స్థానంలో దీన్ని వినియోగించాలని భావిస్తున్నారు. తేజస్‌లో ఎంకే1ఏ అడ్వాన్స్డ్ వేరియంట్. దీంట్లో కొత్తగా ఎయిర్-టు-ఎయిర్ రీఫుయలింగ్ సామర్థ్యం ఉన్నది. ఎంకే 1ఏ యుద్ధ విమానాన్ని 64 శాతం స్వదేశీ వస్తువులతో తయారీ చేశారు.
#WATCH | Nashik, Maharashtra | LCA Tejas Mk 1A gets a water cannon salute after its maiden test flight today. https://t.co/HtZiheoppl pic.twitter.com/R5r4BJZ1ym
— ANI (@ANI) October 17, 2025