న్యూఢిల్లీ, మే 14: వినియోగదారుల రక్షణ చట్టం కింద లాయర్లపై దావా వేసే విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. న్యాయవాద వృత్తి, లాయర్లు తమ క్లయింట్లకు అందించే సేవలు ప్రత్యేకమైనవని, వాటిని వినియోగదారుల రక్షణ చట్టం-1986 కింద ప్రశ్నించలేమని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిశ్రాలతో కూడిన ధ్విసభ్య ధర్మాసనం పేర్కొన్నది. న్యాయవాద వృత్తిని ఇతర వృత్తులతో పోల్చలేమని అభిప్రాయపడింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి లాయర్లు రారని, ‘సేవా లోపం’ పేరుతో లాయర్లపై కన్జూమర్ కోర్టుల్లో దావా వేయలేరని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నియమించుకొన్న సదరు లాయర్ అందించే సేవలు కేవలం ‘వ్యక్తిగత సేవల’ ఒప్పందానికి సంబంధించినవని, అందువల్ల అవి ‘సర్వీస్’ అనే నిర్వచనం నుంచి మినహాయించబడుతాయని కోర్టు పేర్కొన్నది. వినియోగదారుల రక్షణ చట్టం అనేది అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, అనైతికమైన వ్యాపార విధానాల నుంచి పరిరక్షించేందుకు ఉద్దేశించిందని, వృత్తులను, వృత్తిదారులు అందించే సేవలను చట్టం పరిధిలోని తీసుకురావాలని చట్టసభ ఎన్నడూ ఉద్దేశించలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొన్నది. జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) 2007లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలు న్యాయవాద సంఘాలు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.