Lawrence Bishnoi | ముంబై, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యతో లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ గ్యాంగ్ పనితీరు చర్చకు వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో 700 మందికి పైగా షూటర్లు ఉంటారు. ఈ ముఠా స్థానిక గ్యాంగ్ స్టర్ల సాయంతో షూటర్లను అద్దెకు తీసుకొని వారికి ఆయుధ శిక్షణ ఇచ్చి వారి చేత హత్యలు చేయిస్తూ వారికి బాగా డబ్బు ముట్టు చెప్తుంది.
ఈ ముఠాలో ఎక్కువగా పేదలు, బాలలు, దారి తప్పిన యువకులు ఉంటారు. గతంలో పంజాబ్‌కే పరిమితమైన లారెన్స్ ముఠా నేరాలు ప్రస్తుతం ఉత్తరాదిలోని 12 రాష్ర్టాలకు విస్తరించింది. కెనడా, పాకిస్థాన్, దుబాయ్, అమెరికా దేశాల్లోనూ ఈ ముఠాకు నెట్వర్క్ ఉంది. ఈ ముఠాకు ఖలీస్థాని ఉగ్రవాదులతోనూ, ఖలీస్థానీ వేర్పాటు వాద గ్రూపులతోనూ సంబంధాలు ఉన్నాయి. ఈ మఠాకు లాజిస్టిక్, న్యాయ వ్యవహారాలు, సమాచార సేకరణకు ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.
లారెన్స్ జైల్లో ఉన్నా మొబైల్ ఫోన్ సాయంతో ముఠా సభ్యులతో మాట్లాడుతుంటాడు. దేశ, విదేశాల్లోని తన అనుచరులతో కమ్యూనికేషన్ కోసం సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి యాప్‌లు కూడా వినియోగిస్తుంటాడు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా పంజాబీ గాయకులు, లిక్కర్ మాఫియా, డ్రగ్ ట్రాఫికర్లు, ప్రముఖ వ్యాపారులను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడుతుంది. దోపిడీలు, హత్యలు, ఆయుధాల స్మగ్లింగ్ లాంటి నేరాల్లో ఈ గ్యాంగ్ ప్రమేయం క్రమంగా పెరుగుతూ వస్తున్నది.
2014లో లారెన్స్ మొదటిసారి అరెస్టయినప్పుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని నేపాల్ పారిపోయాడు. ఆ తర్వాత 2016లో అరస్టై అప్పటి నుంచి గుజరాత్‌లోని సబర్మతి జైల్లోనే ఉన్నాడు. 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిధూ మూసే వాలా హత్యతో లారెన్స్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాడు. లారెన్స్‌పై హత్య, దోపిడీ తదితర నేరాలకు సంబంధించి రెండు డజన్ల కేసులున్నాయి. నేరాలు చేయడంలో లారెన్స్ ముఠాకు, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు పోలికలున్నాయని పోలీసులు చెప్తారు. లారెన్స్ ముఠా కార్పొరేట్ కంపెనీ తరహాలో పనిచేస్తుందని తెలిపారు.
హిట్ లిస్ట్‌లో ఇంకా ఎవరున్నారు?
ఎన్ఐఏ దర్యాప్తు సమయంలో తన హిట్ లిస్ట్‌లో ఎవరున్నారో లారెన్స్ వెల్లడించారు. దాని ప్రకారం బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. బిగ్ బాస్ 17 విజేత మునావర్ ఫారూఖీ, గాయకుడు సిధూ మూసే వాలా మేనేజర్ షగన్‌ప్రీత్ సింగ్, బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ సిద్ధిఖీ, గ్యాంగ్‌స్టర్ కౌశల్ చౌదరి ఈ జాబితాలో ఉన్నారు.
సల్మాన్ ఖాన్ ఎందుకు టార్గెట్ అయ్యారు?
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడారు. దీనిపై కేసు నడుస్తున్నది. కృష్ణ జింకలను బిష్ణోయ్ వర్గం పవిత్రంగా భావిస్తారు. ఇదే వర్గానికి చెందిన లారెన్స్‌కు సల్మాన్ ఖాన్ జింకల వేట నచ్చలేదు. దీంతో 2018 నుంచి సల్మాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా పని చేస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన ఇంటిపై కాల్పులు జరిపింది. అంతకు ముందు ఆయన ఫామ్ హౌస్ వద్ద రెక్కీలు నిర్వహించింది. సుమారు 25 మంది సల్మాన్ ఖాన్‌పై దాడికి సిద్ధమవుతున్నారని ఇంటెలిజెన్స్ గుర్తించింది.