Jamili Elections | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో లా కమిషన్ తన కసరత్తును ముమ్మరం చేసింది. లోక్‌సభ, రాష్ర్టాల శాసనసభలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఫార్ములా రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని రాష్ర్టాల అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించడం లేదా తగ్గించడం ద్వారా లోక్‌సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించేలా ఫార్ములా రూపకల్పనపై లా కమిషన్ కసరత్తు చేస్తున్నదని తెలిపాయి. అలాగే లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండేలా చూసేందుకు ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొన్నాయి.
జమిలి ఎన్నికల సమయంలో లోక్‌సభ, రాష్ర్టాల అసెంబ్లీలకు దశలవారీగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని, అటువంటి సమయంలో ఓటర్లు రెండు ఎన్నికల కోసం ఒక్కసారి కంటే ఎక్కువసార్లు పోలింగ్ బూత్‌కు వెళ్లాల్సి రాకుండా లా కమిషన్ విధివిధానాలు రూపొందిస్తున్నదని పేర్కొన్నాయి. జమిలి ఎన్నికలను నిర్వహించొచ్చనే అభిప్రాయంలో ఉన్న లా కమిషన్.. ఇంత భారీ ప్రజాస్వామ్య ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ప్రక్రియలపై పనిచేస్తున్నదని తెలిపాయి. ప్రస్తుతానికి లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి ఎన్నికల నిర్వహణలో సూచనలు చేయాలని కేంద్రం లా కమిషన్‌ను ఆదేశించగా, వీటితోపాటుగా స్థానిక సంస్థల కూడా ఎన్నికలు నిర్వహించే విషయంలో సాధ్యాసాధ్యాలపై సిఫార్సులు చేసేందుకు ఇటీవల మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లా కమిషన్‌కు ఇచ్చిన ఆదేశాల పరిధిని స్థానిక సంస్థలకు కూడా విస్తరించొచ్చని వర్గాలు తెలిపాయి.
ఒక ఏడాదిలో రెండు దశల్లో మూడు అంచెల(లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలు) ఎన్నికలు నిర్వహించేలా లా కమిషన్ ఒక సిఫారసు చేయొచ్చని వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా మొదటి దశలో లోక్‌సభ, రాష్ర్టాల అసెంబ్లీలకు కలిసి ఒకసారి, రెండో దశలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా సూచన ఉంటుందని పేర్కొన్నాయి. లోక్‌సభ, రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ చేసిన ప్రతిపాదనకు లా కమిషన్ 2018, ఆగస్టులో ఆమోదం పలికింది. అప్పటి నుంచి జమిలి ఎన్నికల అంశం లా కమిషన్ వద్ద కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్నది.
ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం జమిలి ఎన్నికలు సాధ్యం కాదని, పలు సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నదని లా కమిషన్ ఇప్పటికే తన ముసాయిదా నివేదికలో కేంద్రానికి తెలిపింది. అయితే జమిలి నిర్వహణపై తుది నివేదిక ఇంకా ఖరారు కాలేదు. పలు అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, ఆ కారణంగానే ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తున్నది. దీనిపై లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ జమిలి ఎన్నికల నివేదిక రూపకల్పనలో ఇంకా కొంత వర్క్ చేయాల్సి ఉన్నదని, నివేదిక ఖరారుకు ఎలాంటి కాల వ్యవధి పెట్టుకోలేదని పేర్కొన్న విషయం తెలిసిందే.