న్యూఢిల్లీ: పార్లమెంట్ బిల్డింగ్‌లోని సెంట్రల్ హాల్లో(Central Hall of Parliament ) ఇవాళ చివరి సమావేశం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌లో సమావేశాలు జరగనున్నాయి. అయితే సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు మంత్రులు, విపక్ష నేతలు, ఎంపీలు పాల్గొన్నారు. భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు విపక్ష ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత అయిన ఆయన.. మాట్లాడుతూ.. పార్లమెంటరీ విధుల్ని ఒక కొత్త బిల్డింగ్‌లో ప్రారంభించనున్నామని, కానీ పాత బిల్డింగ్‌ను మిస్ అవుతున్నట్లు ఆయన తెలిపారు. ఏ పార్టీకి చెందిన నేత అయినా.. సభ్యులైనా.. స్వేచ్ఛతో, సమగ్రతతో.. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని, దేశాన్ని నిర్మించుకోవాలన్నారు.
కేంద్ర మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఈ రోజు నుంచి రెండు సభలు కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌లో ప్రారంభంకానున్నట్లు చెప్పారు. బ్రిటన్ నుంచి భారత్‌కు అధికారం అప్పగింతకు సెంట్రల్ హాల్ సాక్ష్యంగా నిలిచిందన్నారు.
ఇది చరిత్రాత్మకమైన రోజు అని, ఇలాంటి చరిత్రాత్మక సందర్భంలో పాల్గొనడం సంతోషంగా ఉందని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ అన్నారు. కొత్త బిల్డింగ్‌కు వెళ్తున్నామని, ఇది కొత్త భారత్ ఆలోచనల్ని ప్రతిబింబిస్తుందన్నారు. దాదాపు 35 ఏళ్లు ఎంపీగా సేవ చేశానని, ఏడు మంది ప్రధానుల్ని చూసినట్లు ఆమె చెప్పారు.
అత్యధిక స్థాయిలో నిరుద్యోగం ఉందని, ప్రజాస్వామ్య ఫలాలు అందేందుకు అవరోధంగా మారుతున్నట్లు ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ మనది అని, కానీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే జీడీపీ ఆ స్థాయికి లేదన్నారు.