న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 : పహల్గాం ఉగ్ర దాడి వెనుక ఉన్న సూత్రధారులను మట్టుబెట్టే ఆపరేషన్లో భారత్ తొలి విజయం సాధించింది. జమ్ము కశ్మీరులోని బందిపొరాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. 26 మంది పర్యాటకులను బలిగొన్న పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న లష్కరే తాయిబా ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి. బందిపొరాలో కొందరు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న భారత సైన్యం, జమ్ము కశ్మీరు పోలీసులు సంయుక్తంగా శుక్రవారం ఉదయం ఆపరేషన్ చేపట్టారు.
ఉగ్రవాదులు దాక్కుని ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ప్రతిగా భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల పోరులో ఓ సీనియర్ అధికారికి చెందిన వ్యక్తిగత భద్రతా బృందంలోని ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. భద్రతా దళాల ఎదురుకాల్పులలో లష్కరే తాయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ మరణించాడు. బందిపొరాలోజరుగుతున్న ఆపరేషన్ గురించి శ్రీనగర్ చేరుకున్న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీకి అధికారులు వివరించారు.